ఇలా ఎత్తుకోండి.. హత్తుకోండి..


 


అమ్మ కాగానే అమ్మాయి మనసులో కలిగే భయాలు, వచ్చే సందేహాలు ఎన్నో! క్రితంసారి అందులో కొన్నిటికి నిపుణులు చెప్పే సలహాలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఈరోజు మరికొన్ని ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకుందాం.

పాపాయిని ఎలా ఎత్తుకోవాలి?

చంటి పాపాయిని చూస్తే ఆనందంగానే వుంటుంది. కానీ, ఎత్తుకోవాలంటే భయం వేస్తుంటుంది. ఎక్కడ తనకి ఇబ్బంది కలుగుతుందో అని. కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు  తీసుకుంటే అప్పుడే పుట్టిన పాపాయిని ఎత్తుకోవటం కష్టం కాదు. చంటి వాళ్ళని ఎత్తుకునేటప్పుడు ఒక చేయి  తన మెడని సపోర్ట్ చేస్తూ వుండాలి ఎప్పుడూ.  ఇంకో చేయి నడుము కింద  వుండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే " T " ఆకారంలో వుండాలి మన చేతులు పాపాయిని ఎత్తుకునేటప్పుడు. మెడ కింద చేయి అడ్డంగా, నడుము కింద చేయి నిలువుగా... రెండు చేతులూ అడ్డంగా పెట్టి నప్పుడు పూర్తి గ్రిప్ వుండదు . అప్పుడు గుండెలకి దగ్గరగా పెట్టి పట్టుకోవాలి సపోర్ట్ కోసం.


పాపాయిని చేతులలోకి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. సున్నితంగా వుండే పాపాయి మెడ కింద మొదట చెయ్యి వేసి అప్పుడు పైకి లేపాలి. సాధారణంగా పాపాయితో పాటు కింద బట్టని కూడా పట్టుకుని ఎత్తుకుంటారు చాలా మంది. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం. స్నానం చేయించాక, మాలిష్ చేసాక... ఇలాంటి సందర్భాలలో పాపాయిని ఎత్తుకునే  ముందు మన చేతులు పొడిగా ఉండేలా చూసుకోవాలి. నూనె చేతులతో ఎత్తుకోవటం మంచిది కాదు . అలాగే ఎత్తుకుని నడిచేటప్పుడు మన ఎడమ మోచేతి మడతలో పాపాయి మెడ వుండాలి, కుడి చేయి తల వరకు అడ్డంగా సపోర్ట్ చేస్తూ పట్టుకోవాలి.

 పాపాయికి గాలి తగులుతోందా, లేదా. అలాగే ముక్కు నొక్కుకుందా  వంటివి చూసుకుంటూ వుండాలి. అన్నిటి కంటే ముఖ్యం... చంటి పిల్లలని ఎత్తుకునే  ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోవద్దు. ఈ చిన్న, చిన్న జాగ్రత్తలతో  ముద్దుగారే చంటి పాపాయిని దగ్గరకు తీసుకుని ఆ ఆనందాన్ని మనసు నిండా ఆస్వాదించండి.

-రమ