పిల్లలు అలగడం నేర్చుకుంటే ఎంత ప్రమాదమో తెలుసా!

మీ ఇంట్లో పిల్లలు ప్రతివిషయానికీ అలుగుతున్నారా? తిండి మానేసి మరీ తమ అలకను ప్రదర్శిస్తున్నారా? అలక పోగొట్టడానికి మీరు చేస్తున్న బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించడం లేదా? అయితే ఇది చదవడానికి సరైన వ్యక్తి మీరే!

'అసలు 'అలుక' అనే మాట అతి పురాతనమైంది. పురాణకాలం నుంచి వినిపిస్తోంది. సత్యభామ అలిగినప్పుడు శ్రీకృష్ణుడు బుజ్జగించిన విధం పురాణ గాథల్లో చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రామాయణ, భారత, భాగవతాల్లో దేవతలు అలిగిన సందర్భాలు మనకు చాలా కనిపిస్తాయి. ఆ తర్వాత కాలంలో అలక ప్రదర్శించే వారికి ప్రత్యేక అలక పాన్పులు ఏర్పాటు చేయడం కూడా మనం విన్నాం. అంతేనా!.... పదవులు రాకపోతే రాజకీయ నాయకులు , అత్తగారు కోర్కెలు తీర్చలేదని అల్లుళ్ళు, అవసరాలు తీరకపోతే భార్య, భర్త మీద..  ఇలా అలకలు చాలానే ఉన్నాయి.

అసలెవరైనా ఎందుకు అలుగుతారు? అని ఆలోచిస్తే వారి అలక తీరాలంటే వారు కోరే గొంతెమ్మ కోర్కెలు తీరడమే మార్గమా అన్న ఆలోచన కూడా రాకమానదు. తమకు ఇవ్వవలసిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పడానికే మాటలు లేకుండానే 'అలక'ను వ్యక్తీకరిస్తారు. వీరు అలిగారు అని ఎవరైనా గుర్తించేలా ఉంటుంది వారి ప్రవర్తన. ఈ ప్రవర్తన ద్వారా అవతలి వారు, అసంకల్పితంగానే అలిగిన వారికి అనుగుణంగా నడుచుకోవాలన్నది అలిగిన వారి ప్రధాన ఉద్దేశం.

నిజం చెప్పాలంటే ఈ అలుకకు వయస్సు, స్థాయి, స్థానం, కులం, మతాలతో సంబంధమే లేదు. సమయాన్ని, సందర్భాన్ని, అనుకూలతను బట్టి ఎవరైనా అలగవచ్చు. మన జీవన విధానాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎదుటి వారి దృష్టిని ఆకర్షించడానికి 'అలకనే ఎందుకు ఆయుధంగా ఉపయోగించుకుంటారన్నది బోధపడుతుంది.

కైకేయి అలకే శ్రీరాముణ్ణి నిర్దాక్షిణ్యంగా అడవులకు పంపేలా దశరథుణ్ణి ప్రోత్సహించింది. దక్షయజ్ఞంలో పార్వతి తన తండ్రిపై అలిగి వెళ్ళిన తరువాత జరిగిన సంఘటనలు అందరికీ తెలిసినవే. తమ పిల్లలు, ఇంకా పసిపిల్లలుగా ఉన్నప్పుడే ఏదైనా విషయానికి అలిగితే ప్రతి తల్లీ నంబరపడి, మురిసిపోతుంది. "అబ్బో వేలెడంత లేదు ఇప్పుడే అలక చూశారా!.. చూశారా! ఎంత చక్కగా అలుగుతున్నాడో” అని ముద్దు చేస్తుంది. కోరింది ఇస్తుంది. అంతే అది చాలు తమకేం కావాలన్నా ఎలా సాధించాలో తెలుసుకోవడానికి కాస్త పెద్దవగానే అలిగి అన్నం మానేస్తారు. అంతే తల్లి మనసు గిలగిల్లాడుతుంది. ఓ పదిసార్లు అలక గురించి వాకబు చేస్తుంది. అన్నం మీద అలగొద్దు. నీకేం కావాలో అదిస్తానే... అని బుజ్జగిస్తుంది. పిల్లవానికి కావాల్సింది అందుతుంది. అప్పటి నుంచి అది జీవితంలో నిరూపించబడిన సత్యంలా గోచరించి ఎప్పుడు అవసరమైతే అప్పుడు అలగొచ్చు అన్న సిద్ధాంతాన్ని పాటించడం మొదలెడతారు. ఈ అలక కూడా వారితో పాటు పెరిగి పెద్దదై కేవలం ఇంట్లో వాళ్లతోనే కాకుండా ఆఫీసులో, అత్తవారింట్లో, స్నేహితుల వద్ద, దగ్గరివాళ్ల వద్ద ఇలా తమ అలకను ప్రదర్శిస్తుంటారు.

ఈ అలక వల్ల కొంత వరకూ తమ కోరికలు నెరవేరినా, కాస్త చులకన అయ్యే ప్రమాదం కూడా ఉంది. ప్రతీ విషయానికీ అలిగే వారి లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి.

ఆత్మ విశ్వాసం తక్కువ ఉంటుంది.

ఇతరులపై ఆధారపడే మనస్తత్త్వం.

తమ నైపుణ్యంతో కాకుండా, ఇతర మార్గాల ద్వారా ఎదుటి వారి దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేయడం.

అనువుగాని చోట అధికులుగా గుర్తింపబడాలనే తపన. 

ఎదుటివారి స్థానంలో ఉండి ఆలోచించగలిగే పరిజ్ఞానం లేకపోవడం.

స్వయం శక్తి మీద అపనమ్మకం.

జరుగుబాటు లేకపోతే అసంతృప్తితో జీవించడం.

మార్పును ఆహ్వానించే హృదయం లేకపోవడం.

తన మాట, ప్రవర్తనే సరైనదన్న మొండి నమ్మకం.

ప్రతి విషయానికీ అలిగే వారు 'తుమ్మితే - ఊడిపోయే...! ముక్కు చందాన ఎదుటివాళ్ళను భయపెట్టే అలవాటు కూడా నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలు అలిగితే మురిసిపోకుండా వారి ప్రవర్తన తప్పుదారిలో వెళ్లకుండా తల్లిదండ్రులే జాగ్రత్త పడాలి.

                                 ◆నిశ్శబ్ద.