"తేనంత తియ్యనిది మరొకటి లేదు" అంటూ మనం తియ్యదనానికి పోలిక కోసం తేనెని సూచిస్తాం. ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం ఈ తేనే అని చెప్పవచ్చు. అద్భుతమైన తియ్యదనం, అరుదైన లక్షణాలు స్వంతం చేసుకున్న తేనే సహజసిద్ధమైన యాంటీబయోటిక్. పంచదారతో పోలిస్తే 40% తక్కువ క్యాలరీలుంటాయి కాబట్టి తేనే వాడకం వల్ల శరీరానికి అందే క్యాలరీలు తక్కువనే చెప్పవచ్చు. శరీరానికి అత్యధిక శక్తి ఇస్తూనే, బరువు పెరగనీయదు ఈ తేనే. అందుకే మన పెద్దవాళ్ళు తేనెని "సర్వరోగ నివారిణి" అంటారు. ఎన్నో అనారోగ్యాలకు తేనే చక్కటి ఔషధంలా పనిచేస్తుంది.

 

తేనే స్వచ్ఛతని ఎలా కనుక్కోవాలి?

1స్వచ్ఛమైన తేనేని గ్లాసు నీటిలో ఒక చుక్క వేస్తే, అది నేరుగా కిందకి చేరుకుంటుంది.

2తేనేని ఎండలో పెట్టినపుడు కరిగితే అది స్వచ్చమైనదని అర్థం.

3అలాగే కొద్దికాలం నిల్వ ఉంచినపుడు దానిలోని పంచదార రేణువుల లాగా గట్టిగా మారుతుంది. తిరిగి వేడి నీటిలో ఉంచినపుడు అది సాధారణ స్థితికి అంటే ద్రవరూపంలోకి వచ్చేస్తే అది స్వచ్ఛమైన తేనే అని అర్థం.


తేనేని భద్రపరిచే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

తేనేని గాజు సీసాల్లో భధ్రపరచటం శ్రేష్టం.

తేనేని ఎప్పుడూ ఫ్రిజ్ లో పెట్టకూడదు.

నేరుగా తేనేను వేడి చేయటం మంచిది కాదు. డబుల్ బాయిల్ పద్దతిలో వేడిచేసినా కూడా సుమారు 200 విలువైన పోషకాలు పోతాయి. అందుకే వేడి వస్తువులతో కలిపి తేనే తీసుకోకూడదంటారు.

ఆరోగ్య పరంగా తేనే వలన ప్రయోజనాలు :

తేనే, నిమ్మరసం కలిపి తీసుకుంటే అదనపు కొవ్వు నిల్వలు కరుగుతాయి.కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయట.

బరువు పెరగాలనుకునే వారు కాచి చల్లార్చిన పాలల్లో రెండు స్పూన్ల తేనే కలిపి రెండు పూటలా తీసుకుంటే మంచిదని చెబుతారు.

పిల్లలకి గోరువెచ్చని పాలలో తేనే కలిపి ఇచ్చినా, లేదా దానిమ్మ రసంలో చెంచా తేనే కలిపి ఇచ్చిన మంచిదే.

అలాగే ఉదయాన్నే చిన్న గ్లాసు నీటిలో తేనే కలిపి ఇచ్చినా మంచిదే.

చదువుకునే పిల్లలకు తేనే తినిపిస్తే మెదడు పనితీరు మెరుగుపడి, అలసట తగ్గుతుంది.

5మిల్లీ గ్రాముల తేనేలో 100 క్యాలరీల శక్తి ఉంటుంది. అంటే పాలకన్నా 5 రెట్లు ఎక్కువ శక్తినిస్తుంది. 10 గుడ్లు తింటే లభించే శక్తి 200 గ్రాముల తేనే తింటే లభిస్తుంది. మాంస కృత్తులు, ఖనిజాలు, కాల్షియం, ఐరన్, విటమిన్ c, సిట్రిక్ ఆమ్లాలు, ఎంజైమ్ లు ఇలా ఎన్నో ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలను కలిగి ఉంటుంది తేనే.