అండాశయంలో తిత్తుల గురించి ఈ విషయాలు తెలుసా?

అండాశయ తిత్తులు అనేవి అండాశయాలపై లేదా లోపల అభివృద్ధి చెందే ద్రవంతో నిండిన సంచులు. చాలా తిత్తులు ప్రమాదకరం కావు,  వాటంతట అవే తగ్గిపోతాయి, కొన్ని అసౌకర్యాన్ని కలిగిస్తాయి లేదా ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. సాధారణంగా అండాశయంలో తిత్తులు స్త్రీ సంతానోత్పత్తికి ముప్పు కలిగించవు  వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ కొన్ని మాత్రం చాలా ఆందోళనకు దారి తీస్తాయి.  ఈ మధ్య కాలంలో మహిళలలో ఈ అండాశయంలో తిత్తుల సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.  ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలలో కూడా  ఈ సమస్యలు కనిపిస్తుండటంతో  గర్భం ధరించే విషయంలో చాలా ప్రశ్నలు వారిలో నిలిచిపోతున్నాయి.  అయితే అసలు అండాశయంలో తిత్తుల గురించి పూర్తీగా తెలుసుకుంటే..


ఎండోమెట్రియోమాస్ , సిస్టాడెనోమాస్,  డెర్మాయిడ్ సిస్ట్‌లు వంటి కొన్ని రకాల సిస్ట్‌లు ప్రాణాంతకమైనవి.  ఇవి ప్రాణాపాయం కలిగించేంత ప్రభావం కలిగి ఉంటాయి.  ఇవి వయస్సుతో పాటు పెరుగుతాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే, ఈ సిస్ట్‌లు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. వీటికి వైద్యం కూడా చాలా నిపుణుల దగ్గర తీసుకోవడం ముఖ్యం.   క్రమం తప్పకుండా చెకప్ లు చేయించుకుంటూ   ఉంటే సిస్ట్ లను ముందే గుర్తించి వాటికి వైద్యం చేయడంలో సహాయపడుతుంది.


ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా?

మహిళలు అండాశయ తిత్తుల గురించి ఆందోళన చెందాల్సిన కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడూ  నీరసంగా లేదా  కటి భాగంలో పదునుగా ఉన్న వస్తువుతో గుచ్చినట్టు నొప్పి కలగడం,  చికాకు కలగడం వంటివి ఎక్కువగా ఉంటే  వైద్యుడిని సంప్రదించాలి. అధిక ఋతు రక్తస్రావం, తరచుగా మూత్రవిసర్జన, మూత్రాశయం నిండినట్లు పదే పదే   అనిపించడం,  కడుపు నొప్పిలో ఆకస్మిక మార్పులు ఈ సిస్ట్ లకు సంకేతాలు.  ఈ లక్షణాలు ఉన్న మహిళలు వైద్యులను కలవాలి. మెనోపాజ్ మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  వీరికి ఈ సమస్యవల్ల ప్రాణం మీదకు వచ్చే అవకాశం ఉంటుంది.


కారణాలు,  ప్రమాదాలు..

అండాశయ తిత్తులు రావడానికి వివిధ కారణాలు ఉన్నాయి. వీటిల అత్యంత సాధారణ కారణం ఋతు చక్రంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు . పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS)లో, అండోత్సర్గము విఫలమైన కారణంగా అండాశయాలలో ఒకటి కంటే ఎక్కువ  తిత్తులు ఏర్పడతాయి.

ఇంకొక  రకం ఎండోమెట్రియాటిక్ తిత్తులు. ఇవి రెట్రోగ్రేడ్ ఋతుస్రావ పద్దతిలో  ముడిపడి ఉన్నాయి, ఇక్కడ ఋతు రక్తం ఫెలోపియన్ గొట్టాలలోకి వెనుకకు ప్రవహిస్తుంది,  అండాశయాలపై ఇంప్లాంట్ అవుతుంది. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (PID) వంటి ఇన్ఫెక్షన్లు కూడా అండాశయాలకు వ్యాపించి తిత్తి ఏర్పడటానికి దారితీస్తుంది. నిరపాయకరమైన తిత్తులు,  ప్రమాదకరమైన తిత్తుల గురించి తెలుసుకోవడానికి , ఆందోళనను తగ్గించుకోవడానికి   మహిళలు క్రమం తప్పకుండా అల్ట్రాసౌండ్ పరీక్షలు,  సాధారణ చెకప్ లు  చేయించుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.

                                     *రూపశ్రీ.