ఉప్పు నీటి కారణంగా జుట్టు రాలుతోందా... ఈ టిప్స్ తో మళ్లీ జుట్టు పెరుగుతుంది..!

ప్రతి నగరం, పట్టణం, గ్రామం.. ఇలా చాలా ప్రాంతాలలో నీటి సప్లై సహజంగా ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాలలో నీరు సహజంగా ఉంటే మరికొన్ని ప్రాంతాలలో మాత్రం నీరు ఉప్పుగా ఉంటుంది.చాలా వరకు ఇంట్లో మినరల్ వాటర్ ను కొనుక్కోవడం, లేదా ఇంట్లోనే వాటర్ ఫ్యూరిఫయర్లు సెట్ చేసుకోవడం కారణంగా నీరు తాగే విషయంలో ఈ ఉప్పు నీటి ఇబ్బంది కనిపించదు. కానీ ఉప్పగా ఉన్న నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడం అనే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఉప్పు నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఇతర ఖనిజాలు తలపై పేరుకుపోయి, రంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల జుట్టు పొడిగా, నీరసంగా, బలహీనంగా మారుతుంది. రాలడం ప్రారంభమవుతుంది. జుట్టు పెరుగుదల కూడా ఆగిపోతుంది. వెంట్రుకలు పలుచగా మారతాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఉప్పు నీటితో స్నానం చేసినా జుట్టు రాలడం ఉండదు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..
నిమ్మకాయ..
ఉప్పు నీటితో జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే, నిమ్మకాయను వాడటం మంచి మారాగం. జుట్టు కడుక్కోవడానికి ఉపయోగించే నీటిలో నిమ్మకాయను పిండాలి. ఇది తల చర్మం యొక్క pH ని సమతుల్యం చేస్తుంద. జుట్టు విరిగిపోకుండా నిరోధిస్తుంది.
వెనిగర్..
నిమ్మకాయను ఉపయోగించ లేకపోతే వెనిగర్ కూడా ఉపయోగపడుతుంది. ముందుగా రెండు చెంచాల వెనిగర్‌ను ఒక బకెట్ నీటిలో కలపాలి. ఇప్పుడు జుట్టును ఆ నీటితో కడగాలి. ఇది జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది.
హెయిర్ మాస్క్..
జుట్టు రకాన్ని బట్టి వారానికి కనీసం రెండుసార్లు హెయిర్ మాస్క్ వాడాలి. మార్కెట్ నుండి హెయిర్ మాస్క్ కొనకూడదనుకుంటే, వారానికి ఒకసారి జుట్టుకు నేచురల్ హెయిర్ మాస్క్ వేయాలి. దీని కోసం పెరుగు, తేనె, కలబంద, గుడ్డు ఉపయోగించవచ్చు. ఇవి జుట్టుకు పోషణను అందిస్తాయి.
షాంపూ..
సల్ఫేట్ ఉన్న షాంపూని ఉపయోగిస్తే, అది ఉప్పు నీటితో కలిపినప్పుడు జుట్టుకు మరింత నష్టం కలిగిస్తుంది. కాబట్టి నీరు ఉప్పగా ఉంటే, సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించాలి. తేలికపాటి, సల్ఫేట్ లేని షాంపూ జుట్టు రాలకుండా నిరోధిస్తుంది.
నీరు మరిగించి చల్లబరచాలి..
జుట్టు కడుక్కోవడానికి మంచి నీటిని ఉపయోగించడానికి ప్రయత్నించాలి. కానీ ఇది సాధ్యం కాకపోతే ఉప్పు నీటిని బాగా మరిగించి, ఆపై చల్లబరిచి, దానితో జుట్టు కడగాలి. ఇది జుట్టు రాలడాన్ని కూడా ఆపుతుంది.
*రూపశ్రీ.



