డైట్ కేర్
ఆహారం విషయంలో మనం ఉండాల్సినంత జాగ్రత్తగా ఉంటున్నామో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువుతో బలంగా, శక్తిగా ఉన్నామో లేదో చూసుకోవాలి. బరువు ఎక్కువై, ఊబకాయం తెచ్చుకుంటే ఎంత కష్టమో, తక్కువై బలహీనంగా ఉన్నా అంతే కష్టం. కనుక సమతుల్యతను కాపాడుకోవాలి. ఆహారంలో ఉండే పోషకాలు శక్తిని విడుదల చేస్తాయి. ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటేనో, లేక హార్మోన్ల అపసవ్యత చోటుచేసుకుంటేనో తప్పించి సాధారణంగా మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి బరువులో హెచ్చుతగ్గులు ఉంటాయి.
ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆహార నియమాలను పాటించాలి. తీసుకున్న ఆహారం సవ్యంగా జీర్ణమయ్యేందుకు కొంత వ్యాయామం తప్పనిసరి. లేకుంటే బరువు విపరీతంగా పెరిగిపోతుంటుంది. కొవ్వు నిల్వలు చేరతాయి. శరీరానికి అవసరమైన శక్తి సరిగా విడుదల కాదు. దాంతో బరువు తగ్గించుకోడానికి నానా యాతనా పడాలి. అవసరమైన కంటే ఎక్కువ ఆహారం ఎలా మంచిది కాదో, తక్కువ తినడమూ శ్రేయస్కరం కాదు. శరీరం శుష్కించుకు పోయి, నీరసం ముంచుకొస్తుంటుంది. ఏ పనిమీదా శ్రద్ధాసక్తులు ఉండవు. ఈ దశ ముదిరితే అసలు జీవితం మీదే ఆసక్తి నశిస్తుంది. కనుక ఏవిధంగా చూసినా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేందుకు ప్రణాళిక వేసుకోవాలి.
మనలో చాలామంది చేసే తప్పు ఏమిటంటే, ఆహారం రుచిగా ఉంటె సరిపోతుంది అనుకుంటాం. కానీ ఆహారం శుచిగా ఉండటం అంతకంటే ముఖ్యం. పరిశుభ్రంగా లేని పదార్ధాల వల్ల లేనిపోని జబ్బులొస్తాయి. అలాగే నిలవున్న పదార్ధాలు విషతుల్యం అయ్యి, ఫుడ్ పాయిజన్ గా మారే ప్రమాదం ఉంది. ఇక ముఖ్యమైన అంశం ఆహారంలో పోషక విలువలు ఉండాలి. కింది కనీస జాగ్రత్తలు పాటించాలి.
1. ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవడంవల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్సు అందుతాయి.
2. వీలైనంతవరకు ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకపోవడం మంచిది.
3. రుచికి, చూపులకు బాగుంటుంది కదాని పోలిష్ పట్టిన తెల్లటి బియ్యాన్ని వాడతాం. కానీ దంపుడు బియ్యపు అన్నం ఎంతో శ్రేష్టం.
4. అన్నం కంటే ఎక్కువగా కూరలను తినడం మంచిది.
5.ఆయా సీజన్లలో దొరికే పండ్లను సేవిస్తుండాలి.
6. నీళ్ళు బాగా తాగాలి. రోజుకు నాలుగు లీటర్లకు తక్కువ కాకుండా తాగితే మంచిది.
7. ఎక్కువ నీళ్ళు తాగి, తరచుగా యూరిన్ పాస్ చేయడంవల్ల శరీరంలో చోటు చేసుకున్న మలినాలు చాలావరకూ వెళ్ళిపోతాయి.
8. ఆహారం ఎక్కువ మొత్తంలో ఒకేసారి తీసుకోవడం కంటే కొంచెం మోతాదులో ఎక్కువసార్లు తినడం మంచిది.
9. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యేందుకు తగిన వ్యాయామం చేయాలి.
10. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తే దాన్ని మించిన ఆరోగ్య రహస్యం ఇంకొకటి లేదు.
ఈమాత్రం కనీస సూత్రాలు పాటించి ఆరోగ్యాన్ని సంరక్షించుకుందాం.