What Parents of Kids Ask a Doctor
తల్లిదండ్రులు చిన్న పిల్లల విషయంలో వైద్యులను అడిగే ప్రశ్నలు
పిల్లలు చిన్నవాళ్లు. వారి సమస్యలూ చిన్నగానే అనిపిస్తాయి. కానీ ఆలోచింపజేస్తాయి.
ఒకసారి ఆలోచిస్తే తీర్చడం సులువే. కనుక వీటి గురించి తెలుసుకుందాం.పిల్లలను
తరచుగా పిల్లల డాక్టరు దగ్గరకు తీసుకెళ్తూ వుంటారు. మామూలుగా వచ్చే సమస్యలకు,
టీకాలకోసం అది తప్పనిసరి.
* పిల్లల్ని పెంచేటప్పుడు అందరికీ అనేక అనుమానాలు, ఆలోచనలు వుంటాయి. వీటిని
తీర్చుకోవడం అన్నివిధాలా మంచిది. ఆ అనుమానాల గురించి తల్లిదండ్రులు తమ
డాక్టరుతో చర్చించడం ఎంతో అవసరం. అలాగే తెలియని విషయాలు తెలుసుకోవడమూ
మంచిదే!
* పిల్లల పెరుగుదల భౌతికంగానూ, మానసికంగానూ వుంటుంది. రెంటికీ సరైన పోషణ
అవసరం. మానసికంగా ఎదుగుదల అంటే సహజంగా వుండాలి. వారి ఆలోచనలు,
అభిప్రాయాలు, వారికంటూ ఒక వ్యక్తిత్వం రూపుదాల్చడానికి ఇవన్నీ అవసరం. వారు
ఎదగడంతోపాటూ చుట్టూ వున్న వాతావరణంలోనూ వారు ఇమడగలగాలి.
* ఆ విషయాలేంటో పరిశీలిద్దాం.ఎక్కువగా పెద్దల్లో ఈ భయాలు మొదటి సంతానంలో
వుంటాయి. రెండోవారికి వచ్చేసరికి పెద్దలకు పూర్తి అవగాహన, అనుభవం ఏర్పడుతుంది.
కనుక పెంపకం సులువవుతుంది.
తల్లిదండ్రులు వైద్యులను అడిగే అనుమానాలలో కొన్ని...
* పండ్లురావడం: జ్వరం, సొల్లుకారడం, చికాకుపడటం, నీళ్ల వీరోచనాలు, మొహం
ఎర్రబడటం... ఇవన్నీ పళ్లు కొత్తగా వచ్చేప్పుడు వుంటాయనేది తల్లిదండ్రుల అపోహ.
చిన్నపిల్లలకు ఏడాది లోపల సహజంగా వచ్చే జ్వరం, దగ్గు, పడిశం ఆ సమయంలోనూ
రావచ్చు. కానీ పళ్లు రావడానికి, జ్వరానికీ సంబంధం లేదు. పండ్లు వచ్చేటపుడు
సొల్లుకారడం, పాప చికాకుపడటం ఉండొచ్చు. కానీ పళ్లు రావడానికీ, తక్కిన లక్షణాలకూ
సంబంధంలేదు. అది యాదృచ్ఛికం మాత్రమే. జ్వరం వచ్చినా, సరిగా తినకపోయినా
వైద్యుని సంప్రదించాలి.
* నిద్ర సమస్య: నిద్రసమస్య పసి వయసులో ఎక్కువ. అది తల్లిదండ్రులకు కష్టంగాను,
భయంగానూ ఉండొచ్చు. పెరిగే పిల్లల్లో 'నిద్ర' పద్ధతి వయసును బట్టి మారుతుంది.
ఉదాహరణకు మొదటి రెండు మూడు నెలల్లో పగలు నిద్రపోయి, రాత్రిపూట మేలుకొని
వుంటారు. అలాంటపుడు కంగారుపడకూడదు. రాత్రి పడుకోబోయేముందు కథ
చెపుతూనో, కబుర్లతోనో నిద్రపుచ్చడం అవసరం. ఒక బొమ్మను పక్కనుంచడం, నచ్చిన
బొమ్మల దుప్పటి కప్పుకోమనడం చేయాలి. ఇవన్నీ వారు క్రమంగా నిద్రలోకి
జారుకోవడానికి తోడ్పడతాయి. పక్కనే తల్లిదండ్రులు వున్నారన్న భరోసా వుంటేనే వారు
బాగా నిద్రపోతారు.
