ఆకర్షణీయమైన శరీర సౌష్ఠవాన్నే ఇంగ్లిష్‌లో బాడీ బిల్డింగ్ అంటారు. ఈ బాడీ బిల్డింగ్‌లో రెండు B అనే అక్షరాలున్నాయి. అయితే మంచి బాడీ బిల్డింగ్ కోసం మరో మూడు B లను గుర్తుంచుకోవడం చాలా మేలు చేస్తుంది. ఈ మూడు B లు వెయిట్ లిఫ్టింగ్ ప్రక్రియలో ఉపయోగపడతాయి. అవే... బ్రీతింగ్(Breathing), బ్యాలెన్స్(Balance), బడ్డీ (Buddy-స్నేహితుడు).

 

Breathing బ్రీతింగ్:వెయిట్ లిఫ్టింగ్ చేసే సమయంలో బరువును ఒకేసారి పెకైత్తే వేళ కొందరు ఊపిరి బిగబట్టేస్తారు. ఇలా చేయడం వల్ల మన రక్తపోటు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. అందుకే బరువును ఎత్తే సమయంలో ఊపిరి బయటకు వదలాలి (ఎక్స్‌హేల్ చేయాలి). అలాగే బరువును కిందికి దించే సమయంలో ఊపిరి పీల్చుకోవాలి. (ఇన్‌హేల్ చేయాలి). వెయిట్ లిఫ్టింగ్‌లో ఇది ఎంతో కీలకం. దీనివల్లనే మన కండరాలన్నీ సమానంగా పనిచేయడంతో పాటు కండరాలన్నింటికీ సమానమైన వ్యాయామఫలితం ఒనగూరుతుంది.

 

Balance బ్యాలెన్స్: వెయిట్‌లిఫ్టింగ్ సమయంలో మన రెండు చేతుల్లో ఇరువైపులా ఉన్న బరువును ఒకేసారి పెకైత్తాలి. అంతేగాని ఎక్కువ బలం ఉన్న కుడి చేతి బరువును కాస్తంత పైకి, ఎడమచేతిలో ఉన్న బరువును అంతకంటే కిందికి ఉండేలా బరువులెత్తకూడదు. ఇలా బ్యాలెన్స్ లేకుండా బరువులెత్తితే అది యాబ్స్, క్వాడ్స్, హ్యామ్‌స్ట్రింగ్స్, డెల్టాయిడ్స్, పెక్టోరల్ కండరాలు... ఇలా అన్ని కండరాలపైనా దుష్ర్పభావం చూపుతుంది. అందుకే మనం బాడీబిల్డింగ్ కోసం చేసే వెయిట్‌లిఫ్టింగ్‌ను చాలా తక్కువ బరువుతోనే మొదలుపెట్టడం మంచిది.

 

Buddy బడ్డీ (స్నేహితుడు): బాడీ బిల్డింగ్ కోసం బరువులు ఎత్తే సమయంలో ఒక స్నేహితుడు తోడుగా ఉండటం ఎంతైనా మంచిది... అవసరం కూడా. బరువులను ఒకరే ఎత్తలేని సమయంలో స్నేహితుడు సహాయపడతాడు. ఒకవేళ బరువు ఎక్కువై ఒకరే దించలేకపోతుంటే గాయపడకుండా కాపాడతాడు. అంతేకాదు... వ్యాయామంలో ఎవరైనా తోడు ఉండటం అటు హుషారుపరచడానికీ, ఇటు ఒకరి తర్వాత మరొకరు చేస్తున్నప్పుడు మధ్యలో కొద్దిపాటి విశ్రాంతినివ్వడానికి... ఇలా ఎవరైనా తోడుండటమన్నది అన్ని విధాలా ఉపయోగపడుతుంది.