బ్లాక్ హెన్నా వాడుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?


ఈ రోజుల్లో జీవనశైలి,  ఆహారపు అలవాట్ల కారణంగా, చిన్న వయస్సులోనే  జుట్టు బూడిద రంగులోకి మారుతోంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది.  పెద్దవాళ్లు కొందరు పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ.. చిన్న వయసులో ఉండే వారు, కాలేజీలకు, ఉద్యోగాలకు వెళ్లేవారు మాత్రం లైట్ తీసుకోలేరు.  ఇందుకోసం  చాలామంది  బ్లాక్ హెన్నాను ఉపయోగిస్తారు. దీన్ని మార్కెట్లో చాలా కంపెనీలు విక్రయిస్తున్నాయి.  అయితే బ్లాక్ హెన్నా మంచిదేనా? దీనివల్ల నష్టాలేమైనా ఉన్నాయా? తెలుసుకుంటే..

బ్లాక్ హెన్నా సహజమైనదా?

 బ్లాక్ హెన్నా సహజమైనది కాదు. చాలా కంపెనీలు దీనిని హెర్బల్ లేదా నేచురల్ అని పిలుస్తూ అమ్ముతాయి. కానీ నిజం ఏమిటంటే చాలా బ్లాక్ హెన్నాలలో రసాయనాలు కలుపుతారు. మార్కెట్లో లభించే చాలా బ్లాక్ హెన్నాలలో PPD అనే రసాయనం కనిపిస్తుంది. ఇది జుట్టుకు ముదురు నలుపు రంగును ఇచ్చే సింథటిక్ డై. నేచురల్  హెన్నా ఎల్లప్పుడూ ఆకుపచ్చ ఆకులతో తయారు చేయబడుతుందని గుర్తుంచుకోండి, ఇది లేత గోధుమ లేదా ఎరుపు రంగును ఇస్తుంది. ఏదైనా బ్లాక్ హెన్నా వెంటనే ముదురు నలుపు రంగును ఇస్తుంటే, దానిలో రసాయన మూలకాలు కలిపి ఉండవచ్చని అంటున్నారు.


బ్లాక్ హెన్నా ప్రయోజనాలు..

తెల్ల జుట్టును త్వరగా నల్లగా మారుస్తుంది.
దీన్ని అప్లై చేసుకోవడం సులభం.
కొన్ని బ్రాండ్లు హెర్బల్  పదార్థాలను కలిగి ఉంటాయి.   తక్కువ మొత్తంలో రసాయనాలను కలిగి ఉంటాయి.
కొంతకాలం జుట్టును మెరిసేలా చేయగలదు.

నష్టాలు..

బ్లాక్ హెన్నా వల్ల అలెర్జీ లేదా చికాకు వచ్చే అవకాశం ఉంటుంది.
తల చర్మం దురద లేదా మంటగా అనిపించవచ్చు.
జుట్టు మూలాలు బలహీనంగా మారవచ్చు.  ఈ కారణంగా జుట్టు రాలిపోవచ్చు.
దీర్ఘకాలిక వాడకం వల్ల జుట్టు పొడిగా,  నిర్జీవంగా మారుతుంది.

                                *రూపశ్రీ.