మార్కులు బాగా తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థి పైనా ఉంది. అలాగని వారిని విద్యార్థులుగానే చూస్తూ, మన పిల్లలన్న విషయం మర్చిపోతే ఎలా! చదవమని చెప్పడం తప్పు కాదు. ఒకవేళ చదవలేకపోతే మండిపడటం తప్పు. ఒక్క చదువు అనే కాదు, ఏ విషయంలోనైనా తిట్టి చెప్పకూడదు. పిల్లలకు కొన్ని బలహీనతలుంటాయి. వాటిని అధిగమించేలా చేయాలంటే మంచి మాటలతోనే సాధ్యం.

 

తిట్టడం, దండించడం మొదలుపెడితే వాళ్లు భయపడతారు. తమ బలహీనతల్ని, తప్పుల్ని దాచిపెడతారు. అయితే అందరూ తల్లులకు తెలియదు. తల్లి మంచి స్నేహితురాలిగా కూడా మెలగాలని. అందుకే వారి పిల్లల మనసుల్లోకి ఎప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోరు. వాళ్ల చిట్టి మనసులు ఎలా ఆలోచిస్తాయో తెలుసుకోలేదు.

 

 

అల్లరి చేస్తే తిడతారు. చదవకపోయినా, ఏదైనా తప్పు చేసినా చేయి చేసుకుంటారు కూడా. అందుకే ఆ పిల్లలో భయం పేరుకుపోతుంది. తప్పు చేశామని చెబితే దండన తప్పదన్న భయంతో నిజాల్ని దాచిపెట్టేశారు. అదే పిల్లలతో స్నేహంగా ఉండి వుంటే, మీరెలా ఉన్నా ఏం చేసినా మేం స్వీకరిస్తామన్న ధైర్యాన్ని పిల్లలకు కలిగించివుంటే, మీ చిన్నారులు భయపడకుండా మీతో అన్ని విషయాలను ధైర్యంగా చెప్పేవారు.

 

 

అందరు తల్లిదండ్రులూ చేయాల్సింది ఇదే. పిల్లలతో స్నేహం చేయండి. మీరేం చెప్పినా మేం అర్థం చేసుకుంటామన్న భరోసా ఇవ్వండి. అది వారికి ధైర్యాన్నిస్తుంది. అలాగని పిల్లల తప్పుల్ని పట్టించుకోకుండా వదిలేయాలని కాదు. పిల్లలన్నాక పొరపాట్లు చేస్తారు. మీరు భయపెడితే వారు చెప్పాలనుకున్న విషయాలను దాచేస్తారు. భయపడి మీతో సరిగా మాట్లాడటం కూడా మానేస్తారు. అదే మీరు ధైర్యాన్నిచ్చారనుకోండి, మీతో అన్ని విషయాలు చెప్పేస్తారు. దాని వల్ల మీ పిల్లల భవిష్యత్తుకు మీరే మంచి బాట వేసినవారవుతారు.