వెన్ను నొప్పినుండి తక్షణ ఉపశమనం
Get relief from Back pain
గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేయడం వల్లనో, లేదా ఇంకే కారణం చేతనైనా వెన్నునొప్పితో బాధపడేవారు ఉంటారు. వారికి భుజంగాసనం చక్కగా ఉపకరిస్తుంది. ఈ ఆసనం వెన్నెముకకు బలాన్ని చేకూర్చి రక్తపసరణను క్రమబద్ధం చేస్తుంది. అంతే కాదు ఛాతీ, కడుపులోని అవయవాలకు , భుజాలకు ఇది మంచి వ్యాయామం. భుజంగాసనంలో చాలా రకాల ఆసనాలు ఉంటాయి . వీటిలోంచి మీకు అనువైనది ఎంచుకుని చేయవచ్చు.
.
-
ముందుగా బోర్లా పడుకుని రెండు చేతులను వెనక్కి తీసుకు వచ్చి కలపాలి. ఆ తరవాత మెల్లిగా తలను
పైకెత్తాలి. ఆ తరవాత రెండు చేతులను కూడా మెల్లిగా పైకి ఎత్తాలి, ఇలా కొన్ని సెకన్లు ఉంచిన తరవాత కిందికి దించాలి. ఇలా రెండు మూడు సార్లు చేయాలి.
-
బోర్లా పడుకునే ఈ సారి చేతులు వెనక్కి పెట్టుకోకుండా నేలకు ఆన్చి పెట్టాలి. తరవాత రెండు చేతులను వీడియోలో చూపిన విధంగా కాస్త పైకి ఎత్తి, మెడను కూడా పైకెత్తాలి . ఇలా చేయడం వల్ల వెన్నెముక పై ఒత్తిడి పెరిగి రక్తప్రసరణ మెరుగుపడుతుంది..
-
బోర్లా పడుకునే మీ రెండు చేతులను మెడకు కాస్త దగ్గరగా తలవెనక భాగంలో కుడి చేతి వేళ్ళలోకి ఎడమ చేతివేళ్ళను పోనిచ్చి పెట్టుకోవాలి. తలను కాస్త పైకెత్తి గాఢంగా ఊపిరి పీల్చుకోవాలి.
-
బోర్లా పడుకునే చేతులను కిందికి ఆన్చి భుజాలను వెనక్కి నెట్టాలి. ఈ ఆసనంలో తలను మరీ పైకి ఎత్తాల్సిన అవసరం ఉండదు.
-
పై ఆసనంలాగే చేతులను కిందికి ఆన్చి వీపుతో పాటు మెడను సాగదీస్తూ తలను పైకి ఎత్తాలి. ఈ క్రమంలో ఛాతీని వీలైనంతగా ముందుకు చాచాలి. ఇలా కొన్ని సెకన్లు ఉన్నతరవాత మళ్ళీ కిందికి రావాలి, ఆ తరవాత మళ్ళీ వీపును మెడను సాగదీస్తూ పైకి లేవాలి, ఈ క్రమంలో భుజాలను వెనక్కి నెట్టడం మాత్రం మరిచిపోకూడదు. ఈ ఆసనంలో మీరు తలను పైకి ఎత్తి ఉంచవచ్చు, లేదా సూటిగా అయినా చూడవచ్చు.
-
బోర్లా పడుకునే ముందుగా రెండు కాళ్ళను వెనక్కి మడిచి వీపుతో పాటు మెడను సాగదీస్తూ పైకి లేచి చేతివేళ్లు నేలకు ఆన్చి ఉంచాలి, అలా కొన్ని సెకన్లు ఉంచి మెల్లిగా యథాస్థితికి రావాలి.
-
బోర్లా పడుకునే మెడను, వీపును సాగదీస్తూ తలను పైకెత్తి మొదట కుడి కాలి మడమను చూడాలి. వీలయితే కుడి చేతిని వీపు మీదుగా ఎడమ తొడపైకి వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా కుడి వైపు చేశాక ఎడమ వైపు కూడా ఇలాగే చేయాలి. చేశాక మెల్లిగా యథాస్థితికి వచ్చి రిలాక్స్ అవ్వాలి.
గమనిక : గర్భవతులు ఈ ఆసనం వేయరాదు. మెడకు సంబంధించిన, లేదా వెన్నెముకకు సంబంధిందిన వ్యాధులతో బాధపడేవారు ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఈ ఆసనాలు వేయడం మంచిది.