అబ్దుల్ కలాం అయినా ఓ అమ్మ కొడుకే
అబ్దుల్ కలామ్ జీవిత చరిత్రను తరచి చూస్తే, తల్లి ఆషియమ్మతో ఆయనకు ఉన్న అనుబంధానికి కళ్లు చెమ్మగిల్లుతాయి. తన ఆత్మకథ ప్రారంభంలోనే, తల్లిని పాఠకులకు పరిచయం చేస్తారు కలాం. పేదరికంలో మగ్గుతున్నప్పటికీ, తన తల్లి ఇంటికి వచ్చిన అతిథుల భోజన మర్యాదలకి ఏమాత్రం లోటురాకుండే చూసేదని చెబుతారు. బహదూర్ అనే గొప్ప బిరుదు సాధించిన వంశంలోంచి తన తల్లి వచ్చిందని ఒకింత గర్వపడతారు. తన తండ్రి నుంచి క్రమశిక్షణ, నిబద్ధత నేర్చుకున్నప్పటికీ... మంచితనం, జాలి, కరుణ లాంటి సద్గుణాలు తన తల్లి నుంచే అలవడ్డాయంటారు. ఆమె నోటి నుంచి మహమ్మద్ ప్రవక్తకి చెందిన కథలతో పాటు రాముని వీరగాథలు విన్న కలాం పరమత సహనాన్ని అలవర్చుకున్నారు. ఆమె చెప్పిన కథల్లోని తాత్వికతా, విచక్షణలు జీవితంలో ఎన్నో సమస్యలను నిబ్బరంగా పరిష్కరించేందుకు తోడ్పడ్డాయి.
ఆ రోజుల్లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. మరోపక్క కలాం ఇంట్లోని ఆర్థిక పరిస్థతులు బాగోలేవు... అయినా హైస్కూల్ చదువుల కోసం రామనాధపురానికి చేరుకున్నాడు కలాం. చదువుకోవాలని మనసులో ఎంతగా తపన ఉన్నా... తన తల్లినీ, ఆమె చేతి వంటనూ మర్చిపోలేకపోయేవాడు. ఎప్పడు వీలు చిక్కుతుందా, ఎప్పుడు అమ్మ ఒడిలో వాలిపోయి ఆమె చేసే పిండివంటలు తిందామా అని ఉబలాటపడిపోయేవాడట!
కలాం తుంబా (కేరళ)లో శాస్త్రవేత్తగా విజయాల సాధిస్తుండగా ఆయన తండ్రి చనిపోయారు. అయినా కలాంతోపాటు తుంబాకు వెళ్లకుండా, తన చివరి శ్వాస వరకు రామేశ్వరంలోనే ఉండేందుకు నిశ్చయించుకున్నారు ఆషియమ్మ. అన్నట్లుగానే మరికొద్ది రోజులకి ఆమె చనిపోయారు. ఆ విషయం తెలిసి పరుగులెత్తుకుంటూ రామేశ్వరాన్ని చేరుకున్నారు కలాం. తన తల్లి ఎడబాటు కలాంకు భరింపరానిదయ్యింది.
ఆ బాధని మర్చిపోయేందుకు, మర్నాడు మసీదుకి వెళ్లారు. అక్కడ తన తల్లితండ్రుల గురించి ఆ భగవంతుని ప్రార్థిస్తుండగా... `నేను వారికి నియమించిన బాధ్యతలను వారు ఎంతో శ్రద్ధతో, నిజాయితీతో, నిబద్ధతతోనూ నిర్వర్తించి తిరిగి నన్ను చేరుకున్నారు. వాళ్లు ఇంత అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సందర్భంలో నువ్వు బాధపడుతున్నావెందుకని? నీ ముందున్న బాధ్యతలను చక్కగా నిర్వర్తించి నా మహిమను లోకానికి తెలియచేయి` అన్న మాటలు వినిపించాయంటారు కలాం. వినిపించిన మాటలు భ్రమ కావచ్చునేమో కానీ వాటిలో వాస్తవం లేకపోలేదు కదా!
తల్లి ప్రభావం కలాం మీద గాఢంగానే ఉన్నట్లు తోస్తుంది. 2013లో హైదరాబాదులో చేసిన దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ స్మారక ఉపన్యాసంలో `స్త్రీలు సాధికారతని సాధించినప్పడు కుటుంబమూ, సమాజమూ, దేశమూ అభివృద్ధి చెందుతాయి. స్త్రీ సంతోషంగా ఉంటేనే, కుటుంబం సంతోషంగా ఉంటుంది. కుటుంబం సంతోషంగా ఉంటేనే సమాజమూ, సమాజం సంతోషంగా ఉంటే రాష్ట్రమూ, రాష్ట్రం సంతోషంగా ఉంటే దేశమూ సుభిక్షంగా ఉంటుంది.`అని చెప్పారు. రాష్ట్రపతిగా ఉన్న కాలంలో కూడా కలాం, స్త్రీలకు సంబంధించి ఓ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. బెంగాల్‌కు చెందిన ధనుంజయ్ ఛటర్జీ అనే వ్యక్తి ఒక ఆడపిల్లని అత్యాచారం చేసి చంపేశాడు. ఆ కేసులో అతనికి ఉన్నత న్యాయస్థానం ఉరిశిక్షను ఖరారు చేసింది. తనకు క్షమాభిక్షను ప్రసాదించమని ధనుంజయ్, కలాంను వేడుకున్నారు. సున్నిత మనస్కుడైన కలాం, ఆ శిక్షను రద్దు చేస్తారనుకున్నారంతా! కనీసం ఆ ఉత్తర్వును తాత్కాలికంగా నిలుపుదల చేస్తారనుకున్నారు. కానీ ఆయన నిర్ద్వంద్వంగా ఆ క్షమాభిక్షను తిరస్కరించారు.
ఎన్నో ఏళ్ల క్రితమే తన తల్లికి దూరమైనప్పటికీ, ఆమె అనురాగానికి దూరం కాలేదు కలాం. తనకు పద్మభూషన్ వచ్చిందన్న వార్త తెలియగానే, తన గదిని బిస్మిల్లాఖాన్ సంగీతంతో నింపివేశారు. ఆ సంగీతం తనని వేరే లోకానికి తీసుకువెళ్లిందని చెబుతారు కలాం! ఆ లోకంలో కలాం తల్లిని హత్తుకుని ఉన్నారు. కలాం తండ్రి తన మునివేళ్లతో ప్రేమగా కలాం జత్తుని స్పృశిస్తున్నారు. కలాం గురువైన జలాలుద్దీన్ ఈ కబురుని నలుగురితో పంచుకునేందుకు హడావుడి పడుతున్నాడు... దేశంలోని ప్రజలంతా జేజేలు పలుకుతున్నారు. కలాం ఊహించిన ఈ కల ఇప్పడు నిజమైంది. స్వర్గమనేది ఉంటే అందులో అలసిసొలసిన అబ్దుల్ కలాం తన తల్లిదండ్రుల చెంత సేదతీరుతూ ఉండి ఉంటారు. కాకపోతే తేడా అల్లా ఇప్పడు దేశంలోని ప్రజలంతా బాధలో మునిగి ఉన్నారు.
-nirjara