పిల్లల్లో ఒత్తిడిని చిత్తు చేయండిలా...

 

 

   ఉరుకుల, పరుగుల జీవితం పెద్దలకే కాదు... పిల్లలకీ తప్పడం లేదు ఈ రోజుల్లో. నిద్రకళ్ళతోనే స్కూలు బస్సు ఎక్కే పిల్లలు ఎందరో. ఇక సాయంత్రం ఇంటికి వస్తూనే హోం వర్కులు, ప్రాజెక్టు వర్కులూ... ఊపిరి తీసుకునే సమయం కూడా వుండటం లేదు వారికి. ‘‘ఏం చేస్తాం... ఇదంతా ఇప్పటి కాంపిటీటివ్ ప్రపంచంలో తప్పవు’’ అనే పేరెంట్స్‌ని కాస్త ఆలోచించమంటున్నారు మానసిక నిపుణులు. చిన్నతనం నుంచే విపరీతమైన ఒత్తిడికి లోనయ్యే పిల్లల్లో చురుకుదనం, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, ఏకాగ్రత తగ్గే అవకాశం చాలా ఎక్కువ. ‘‘ఎంత ఒత్తిడికి గురయితే అంత బాగా నైపుణ్యాలు సొంతమవుతాయనే భ్రమ వద్దు’’. ఒత్తిడి పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వారి నైపుణ్యాలపై కూడా ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి పిల్లలు ఒత్తిడికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటున్నారు.


బాగా ఆడించండి

మీరు కరెక్టే చదివారు. ఎంత శారీరక అలసట వుంటే అంత ఒత్తిడి తగ్గుతుంది. పిల్లలకి ఆ అలసట ఆటల్లో దొరుకుంతుంది. రోజుకి కనీసం రెండు గంటలపాటు బాగా అలసిపోయేలా ఆరుబయట ఆడించాలి. అది వారిని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా వుంచుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. పిల్లల్లో ఎన్నో నైపుణ్యాలకి సానపట్టేవి ఆటలే. పదిమందితో కలవటం, ఓడటం, గెలవటం, సర్దుకుపోవడటం అన్నీ వస్తాయి. మానసికంగా బలంగా తయారవుతారు. దాని నుంచి రోజువారీ ఎదురయ్యే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్చుకుంటారు. ఇలా పిల్లలకి అన్ని విధాలా ఆటలు మేలు చేస్తాయి. అలాగే వారిని ఉల్లాసంగా ఉంచుతాయి. కాబట్టి ఓ గంటసేపయినా పనులు పక్కనపెట్టి పిల్లల ఆటల్లో భాగం కండి. ఆరకంగా మీరూ మీ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందచ్చు.

ప్లానింగ్ నేర్పించాలి
ఒత్తిడికి మరో కారణం- టైమ్ చూసుకుంటూ పరుగులు పెట్టడం. ఆ ఒత్తిడి తగ్గాలంటే ప్రణాళికతో రోజుని ఎలా ప్రారంభించాలో పిల్లలకి నేర్పాలి. ముందురోజే స్కూలు బ్యాగు సర్దుకోవడం నుంచి రోజు ఓ అరగంట ముందు లేచి రిలాక్స్‌గా తయారవ్వటం దాకా అన్నీ ముఖ్యమే. ‘‘టైమ్ అయిపోయింది’’, ‘‘టైమ్ లేదు’’ లాంటి మాటల నుంచి విముక్తి దొరికితే పిల్లలు సీతాకోక చిలుకల్లా ఆనందంగా వుంటారు. కాబట్టి కాస్త కష్టమైనా టైమ్ మేనేజ్‌మెంట్‌ని ఇంట్లో పెద్దలు ఆచరిస్తే పిల్లలు అనుసరిస్తారు.

కొంచెం కబుర్లు
పిల్లలంటేనే వసపిట్టలు. అన్ని విషయాలనీ అనర్గళంగా చెబుతూనే వుంటారు. అందులోనూ రకరకాల భావావేశాలతో. వారి ఆ మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయద్దు. సాధారణ విషయాలతోపాటు వారిలోని భయాలు, ఆందోళనల వంటివి కూడా బయటకి వచ్చేందుకు ఆ కబుర్లే సాధనం. ‘‘మాట్లాడకుండా చదువుకో’’ అన్న ఒక్క మాట పిల్లల ఉత్సాహాన్ని నీరుగార్చేస్తుంది. పిల్లలని మాట్లాడనివ్వండి. మీరూ మాట్లాడండి. ఉదయం నిద్రలేచి ఎవరి దారిన వారు పరుగులు పెట్టేముందు కుటుంబ సభ్యులతో ఫ్యామిలీ టైమ్ అంటూ ఓ పది నిమిషాలు ఒకచోట కూర్చుని కబుర్లతో రోజుని ప్రారంభించి చూడండి. అలానే రాత్రి నిద్రకి ముందు  ఓ నాలుగు కబుర్లు చెప్పకుంటే అందరి ఒత్తిడి ఎగిరిపోతుంది. అనుబంధాలు బలపడతాయి. పిల్లలకు భరోసాగా వుంటుంది. వారిలో ఉత్సాహం నిండుతుంది. పిల్లలకి ప్రత్యేకంగా మనం ఏమీ నేర్పించక్కర్లేదు. మనం ఆచరించి చూపిస్తే చాలు పిల్లలు వాటినే ఫాలో అవుతారు. ఒత్తిడితో క్రుంగిపోతూ రోజులని బరువుగా వెళ్ళదీయడం కాదు. ‘‘ఎంత ఒత్తిడినైనా దరిచేరనివ్వకుండా నవ్వుతూ, తుళ్ళుతూ సాగిపోవడమే జీవితం’’ అన్న విషయం పిల్లలకి అర్థమైతే చాలు - ఎప్పటికీ ఆనందంగా వుంటారు.


-రమ