దర్శక నిర్మాతగా మారిన నటి కల్యాణి
on Mar 9, 2020

అనేక సూపర్ హిట్ సినిమాల్లో నాయికగా నటించి, తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి కల్యాణి తాజాగా దర్శక నిర్మాతగా మారారు. ఇటీవలి కాలంలో అతిథి పాత్రల్లో కనిపిస్తూ వస్తున్న ఆమె కే2కే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా విలక్షణ ప్రేమకథతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా కల్యాణి తీస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తయారవుతోంది.
ఈ సినిమా ప్రి లుక్, టీజర్ గ్లింప్స్‌ను హోలీ పర్వదినం సందర్భంగా సోమవారం డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆవిష్కరించారు. చేతన్ శీను, సిద్ది, సుహాసినీ మణిరత్నం, రోహిత్ మురళి, శ్వేత ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నది.
బాలనటిగా కెరీర్ ఆరంభించిన కల్యాణి, 1986 నుంచి సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. రాజశేఖర్ జోడీగా నటించిన 'శేషు' తెలుగులో ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, వసంతం, కబడ్డీ కబడ్డీ, దొంగోడు, పెదబాబు, పందెం, ఆపరేషన్ దుర్యోధన, లక్ష్యం.. వంటి హిట్ సినిమాల్లో నాయికగా నటించారు. ఇటీవల 'టాక్సీవాలా', 'యాత్ర' సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించారు. తనకున్న విస్తృతానుభవంతో ఒకవైపు నిర్మాతగా మారుతూనే మరోవైపు దర్శకత్వాన్నీ చేపట్టారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



