కొరటాల శిష్యుడి తమిళ సినిమాలో లావణ్యా త్రిపాఠి
on Mar 7, 2020
సందేశాత్మక కథలను వాణిజ్య విలువలు జోడించి, ప్రేక్షకులు కోరుకునే హంగులతో చిత్రాలు తెరకెక్కిస్తూ... వరుస విజయాలు అందుకుంటున్న దర్శకుడు కొరటాల శివ. ఆయన దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన రవీంద్ర మాధవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తమిళంలో అథర్వ కథానాయకుడిగా ఆయనో సినిమా తెరకెక్కిస్తున్నారు. గ్లోబర్ ఇన్‌ఫోటైన్‌మెంట్ పతాకంపై మైఖేల్ రాయప్పన్ నిర్మిస్తున్న ఆ సినిమాలో కథానాయికగా లావణ్యా త్రిపాఠిని తీసుకున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు రవీంద్ర మాధవ మాట్లాడుతూ ‘‘మా సినిమాలో హీరోయిన్ కోసం చాలా రోజులుగా అన్వేషణ సాగిస్తున్నాం. ఒకసారి హీరోయిన్ క్యారెక్టర్ కంప్లీట్ స్కెచ్ వచ్చాక... ఆకర్షణీయమైన రూపంతో పాటు అద్భుతంగా నటించగల హీరోయిన్ ఎవరైనా అయితే ఆ పాత్రకు మరింత విలువ పెరుగుతుందని భావించాం. మా సినిమాలో హీరోయిన్ రోల్ ఏదో ఇలా వచ్చి అలా వెళ్లిపోయేలా ఉండదు. మెచ్యూర్డ్, బోల్డ్ క్యారెక్టర్. అదే సమయంలో తెలివైన అమ్మాయి. సినిమా అంతటా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించదు. హీరోని ప్రశ్నించే విధంగా హీరోయిన్ పాత్ర ఉంటుంది. అందుకని, చాలామంది పేర్లు పరిశీలించిన తర్వాత లావణ్యా త్రిపాఠిని ఎంపిక చేశాం. తనకు కథ, క్యారెక్టర్ నచ్చాయి. అయితే... అంతకు ముందు అంగీకరించిన కొన్ని చిత్రాల వల్ల చేయలేనని చెప్పారు. చివరకు, ఆమెను సినిమాలోకి తీసుకురాగలిగాం. లావణ్యా త్రిపాఠి నటన, స్ర్కీన్ ప్రజెన్స్ హీరోయిన్ పాత్రకు మరింత విలువ, హుందాతనాన్ని తీసుకొస్తుంది’’ అని అన్నారు.