'కేజీఎఫ్ చాప్టర్ 2' టీజర్ రివ్యూ.. సింప్లీ ఔట్‌స్టాండింగ్!
on Jan 7, 2021
రాకింగ్ స్టార్ యశ్ ఫ్యాన్స్ పండగ చేసుకొనేలా 'కేజీఎఫ్' చాప్టర్ 2 టీజర్ వచ్చేసింది. యశ్ బర్త్‌డే సందర్భంగా జనవరి 8న ఉదయం 10:18 గంటలకు టీజర్ వెలువడుతుందని మొదట ప్రకటించిన మేకర్స్ ఎందుకనో మనసు మార్చుకొని, ఈ రోజు (గురువారం) రాత్రి 9:29 గంటలకు తమ అధికార యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే ఈ టీజర్ లక్ష వ్యూస్ దాటేసింది.
దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ అయిన 'కేజీఎఫ్'కు సీక్వెల్‌గా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' కోసం యశ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రియులంతా అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ తదితర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా క్రేజ్ అవుతూ వస్తోంది. యశ్ బర్త్‌డేని పురస్కరించుకొని టీజర్ తీసుకొస్తున్నామని నిర్మాత, హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరంగదూర్ ప్రకటించడంతో ఆ క్షణాల కోసం ఫ్యాన్స్ కుతూహలంగా ఎదురుచూస్తుండగా, ముందుగానే గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు టీజర్‌ను రిలీజ్ చేశారు.
టెక్నికల్‌గా, మేకింగ్ పరంగా, నెరేషన్ పరంగా 'చాప్టర్ 1' హై స్టాండర్డ్స్‌లో ఉందని ప్రశంసలు పొందగా, మేకింగ్, టెక్నికల్ విషయాల్లో 'చాప్టర్ 1'ను మించి 'చాప్టర్ 2' ఉండబోతోందని రెండు నిమిషాల నిడివి ఉన్న టీజర్ తెలియజేసింది. రవి బస్రూర్ మ్యూజిక్, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ అనేది ఖాయం. బాల్యంలో రాకీ తల్లికిచ్చిన మాటను మరోసారి గుర్తుచేస్తూ ఈ టీజర్ మొదలైంది.
ప్రకాశ్‌రాజ్ వాయిస్ ఓవర్ వినిపిస్తుండగా, సినిమాలోని ప్రధాన పాత్రధారులైన రావు రమేశ్, రవీనా టాండన్, ఈశ్వరీ రావ్, నిధి శెట్టి (హీరోయిన్) లను ఒక్కొక్కరిగా పరిచయం చేస్తూ, అప్పుడు పవర్‌ఫుల్ విలన్ అధీరగా నటించిన సంజయ్ దత్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. అధీరగా సంజయ్ చెలరేగిపోతాడనీ, సినిమాకు బిగ్ ప్లస్ అవుతాడనీ చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. ఆయన రూపాన్ని ఫ్రంట్ నుంచి కాకుండా బ్యాక్ నుంచి చూపించారు. ఆయన రూపం, ఆయన కత్తి పట్టుకొన్న తీరు గగుర్పాటు కలిగించే విధంగా ఉన్నాయి.
చివరలో హీరో రాకీ (యశ్) క్యారెక్టర్‌ను మరింత పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. ట్రైపాడ్ మీద అమర్చిన మెషిన్‌గన్‌ను దడదడలాడిస్తూ, ఎదురుగా పోలీస్ స్టేషన్ ముందు పార్క్ చేసిన అనేక పోలీస్ జీపుల్ని యశ్ పేల్చివేయడం గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. తన పని అయ్యాక నోట్లో సిగరెట్ పెట్టుకొని నిప్పుకణికలా మండిపోతున్న గన్ బారెల్‌తో దాన్ని ముట్టించి, పొగపీల్చి వదిలే స్టైల్‌కు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోకుండా ఉంటారా! లోపల బ్లాక్ షర్ట్, పైన వైట్ కోట్‌తో, ఇంటెన్స్ లుక్స్‌తో యశ్ మరోసారి అదరగొట్టేస్తున్నాడు.
లాస్ట్‌లో 'కేజీఎఫ్' సిగ్నేచర్ థీమ్ మ్యూజిక్ వినిపిస్తుండగా, తల్లికిచ్చిన మాటను రాకీ నిలబెట్టుకుంటాన్నట్లు చూపించారు. సినిమా ఎప్పుడు రిలీజవుతుందో టీజర్‌లో చెప్పలేదు. త్వరలో థియేటర్లలో విడుదలవుతుందని మాత్రం చెప్పారు. టీజర్‌లో ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ ఇంగ్లీష్‌లో అయితే వినిపించింది కానీ, ఆయన క్యారెక్టర్ కనిపించలేదు.
'చాప్టర్ 1'లో కోలార్ గోల్డ్ మైన్స్‌ను చూపించిన దానికంటే మరింత బాగా ఈ సినిమాలో చూపిస్తున్నారని గ్రహించవచ్చు. ఖర్చు కూడా మొదటి దాని కంటే రెట్టింపు దీనికి పెట్టారనేది స్పష్టంగా తెలుస్తోంది. శాంపుల్‌గా చూపించిన కొన్ని షాట్స్‌తోటే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోని గ్రేట్ టెక్నికల్ మూవీస్‌లో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుందనే అభిప్రాయం కూడా కలుగుతోంది.
ఏదేమైనా టీజర్‌తోటే 'కేజీఎఫ్ చాప్టర్ 2'పై అంచనాలను మరింత పెంచేశారు మేకర్స్. టీజరే ఇలా ఉందంటే, మరి కొద్ది రోజుల్లో వచ్చే ట్రైలర్ మరింత అదరగొడుతుందనీ, ఇక సినిమా అయితే బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ ఫిగర్స్‌ను నమోదు చేస్తుందనీ ఆశించడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
