అప్పుడు 'కిక్'.. ఇప్పుడు 'క్రాక్'.. రవితేజకు పూర్వ వైభవం?
on Jan 8, 2021
వరుస ఫ్లాపులు, డిజాస్టర్లతో కెరీర్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాస్ మహారాజా రవితేజను లేటెస్ట్ ఫిల్మ్ 'క్రాక్' గట్టెక్కించడమేఏ కాకుండా, పూర్వవైభవం దిశగా ఆయనను నడిపిస్తుందని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలవారు ఆశిస్తున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఆ మూవీ రేపు (జనవరి 9) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
వాస్తవానికి 'క్రాక్'ను జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు మొదట నిర్మాతలు అనౌన్స్ చేశారు. కానీ అదే రోజు రామ్ పోతినేని మూవీ 'రెడ్' రిలీజ్ ఉండటం, దానికి ఒక రోజు ముందు జనవరి 13న విజయ్ మోస్ట్ క్రేజియస్ట్ మూవీ 'మాస్టర్' విడుదలవుతుండటం, 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అవుతుండటం.. వీటిని దృష్టిలో పెట్టుకొని జనవరి 9నే 'క్రాక్' వస్తున్నట్లు ప్రకటించారు. దీనివల్ల మంచి ఓపెనింగ్స్‌తో సినిమాకు లాభం చేకూరుతుందనేది చిత్ర బృందం ఆలోచన. అది నూటికి నూరు పాళ్లూ నిజం.
విడుదలకు ముందే ఇంత పాజిటివ్ టాక్ రావడం, యూనిట్‌లో అమితమైన ఆత్మవిశ్వాసం కనిపించడం రవితేజ మునుపటి ఐదారు సినిమాలకు మనం చూడలేదు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా, సూపర్ హిట్టయిన 'రాజా ది గ్రేట్' మూవీకి సైతం విడుదలకు ముందు ఈ స్థాయి అంచనాలు లేవు. ఆ సినిమా తర్వాత.. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా సినిమాలు డిజాస్టర్స్ కావడంతో రవితేజ అప్‌సెట్ అయ్యాడో, లేదో కానీ, ఫ్యాన్స్ బాగా డీలా పడిపోయారు.
ఎలాంటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేకుండా సెల్ఫ్‌మేడ్ స్టార్ అయిన రవితేజకు మాస్ ఆడియెన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే స్క్రిప్టుల ఎంపికలో ఆయన పొరపాట్లు చేస్తూ వస్తున్నాడని ఆ సినిమాలను చూస్తే మనకు అర్థమవుతూ వచ్చింది.
ఈసారి 'క్రాక్' స్క్రిప్ట్ ఎంపికలో ఆ పొరపాటు చేయలేదని చాలామంది నమ్ముతున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూశాక, వారి నమ్మకం మరింత పెరిగింది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ పోతరాజు వీరశంకర్ క్యారెక్టర్‌లో మునుపటి ఎనర్జిటిక్ రవితేజ కనిపిస్తున్నాడనీ, అందులో ఆయన చెలరేగిపోయాడనీ వారు భావిస్తున్నారు. ట్రైలర్ కోసం కట్ చేసిన షాట్స్ సూపర్బ్‌గా ఉన్నాయనీ, ఫ్యాన్స్ అంచనాలను అందుకొనే రీతిలో వీరశంకర్ క్యారెక్టర్‌ను డైరెక్టర్ గోపీచంద్ మలచాడనీ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'క్రాక్' మూవీని రవితేజ తన భుజస్కంధాలపై నడిపించాడనీ, ఈ సినిమాతో హిట్ కాకుండా.. బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంటాడనీ వారు గట్టి నమ్మకంతో ఉన్నారు.
రవితేజ బాడీ లాంగ్వేజ్ కూడా అందుకు తగ్గట్లే ఉంది. ఇదివరకు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో చేసిన 'కిక్'తో ఏ రేంజ్ హిట్‌ను ఆయన సాధించాడో, ఇప్పుడు 'క్రాక్'తో గ్యారంటీగా అదే రేంజ్ హిట్‌ను అందుకుంటాడని ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశిస్తున్నాయి. ఫెయిల్యూర్ బాటను వీడి, సక్సెస్ ట్రాక్‌లోకి రవితేజ రావాలని అందరూ కోరుకోవడం మనం ఇప్పుడు చూస్తున్న నిజం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
