విజయ్ దేవరకొండ: మళ్లీ అదే కథ!.. 'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్ రివ్యూ
on Jan 3, 2020

"ఐ డిడ్ నాట్ జస్ట్ స్ప్రెడ్ యువర్ లెగ్స్ యామినీ .. ఐ లవ్డ్ యు.. ఐ లవ్డ్ యు యామినీ".. అని బిగ్గరగా ఏడుస్తూ చెప్పాడు దేవరకొండ విజయ్ సాయి.. అదేనండీ విజయ్ దేవరకొండ. కెరీర్ మొదట్లో విజయ్ సాయి గానే స్క్రీన్ నేమ్ వేసుకుంటూ వచ్చిన అతను ఇటీవల విజయ్ దేవరకొండగా మారాడు. ఇప్పుడు 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాకి మళ్లీ దేవరకొండ విజయ్ సాయిగా వేసుకుంటున్నాడు. ఈ మూవీ టీజర్ ఈరోజు రిలీజయ్యింది. విజయ్ లుక్స్ చూడగానే 'అర్జున్‌రెడ్డి' లుక్స్ గుర్తుకు వస్తోంది. అందులో ఒక దశలో క్లీన్ షేవ్‌తో, ఇంకో దశలో ఫుల్ బియర్డ్‌తో విజయ్ కనిపించిన విషయం తెలిసిందే. లవర్ తనకు దూరమైందన్న ఫ్రస్ట్రేషన్, కోపంతో ఆ సినిమాలో అతను తాగుబోతుగా తయారై, గడ్డం పెంచేస్తాడు. ఇప్పుడు 'వరల్డ్ ఫేమస్ లవర్'లోనూ ఆ తరహా క్యారెక్టరైజేషన్‌తో కనిపిస్తాడనే ఫీల్‌ను టీజర్ కలిగిస్తోంది. అంతే కాదు.. అతడు 'యామినీ' అని అరుస్తుంటే, 'డియర్ కామ్రేడ్'లో 'లిల్లీ' అని అతను అరవడం గుర్తుకు వస్తోంది.
ఈ మూవీలో యామినిగా కనిపించబోతోంది రాశీ ఖన్నా. ఆమె అతడిని దూరం పెట్టింది కాబోలు, తను ఆమెను ప్రేమిస్తున్నానని ఏడుస్తూ చెప్తున్నాడు గౌతమ్ అలియాస్ శ్రీను పాత్ర చేస్తోన్న విజయ్. అప్పుడతను పెరిగిపోయిన జుట్టు, పెద్ద గడ్డంతో కనిపిస్తున్నాడు. టీజర్ మొదట్లో "ప్రేమంటే ఒక కాంప్రమైజ్ కాదు, ప్రేమంటే ఒక శాక్రిఫైస్. ప్రేమలో ఒక దైవత్వం ఉంటుంది. అవేవీ నీకర్థం కావు" అని యామిని క్యారెక్టర్ చేస్తోన్న రాశీ ఖన్నా భారమైన కంఠంతో చెప్తోంది. ఆమె మాటల్ని బట్టి ఆ ఇద్దరూ ప్రేమలో ఉన్నారనీ, అయితే ప్రేమను గౌతమ్ చాలా క్యాజువల్‌గా, సరదా వ్యవహారంగా తీసుకుంటాడనే అభిప్రాయం కలుగుతోంది. టీజర్ ప్రకారం అతనికి ఐశ్వర్యా రాజేశ్ పోషిస్తోన్న సువర్ణ పాత్రతో పెళ్లవుతుందనీ, అయితే యామినితో అతను శారీరకంగా కలుస్తాడనీ మనకు తెలుస్తుంది.
ఈ కథలో మొత్తం నలుగురు హీరోయిన్లు ఉన్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, క్యాతరిన్ ట్రెసా, ఇజాబెల్లే లెయితే. నాలుగు దశల్లో ఈ నలుగురూ విజయ్ జీవితంలో ప్రవేశిస్తారని ఇదివరకే దర్శక నిర్మాతలు తెలియజేశారు. సింగరేణి ఉద్యోగి శీనుగా కనిపించే సందర్భంలో అతనికి సువర్ణతో పెళ్లవుతుంది. అయితే టీజర్‌లో క్యాతరిన్ బొగ్గు గనుల దగ్గరకు వచ్చినట్లు చూపించారు. ఆమె కూడా ఆ సమయంలో అతడిపై పేమలో పడుతుందని ఊహించుకోవచ్చు. విజయ్, ఇజాబెల్లేలను జంటగా ప్యారిస్ టవర్ దగ్గర చూపిస్తుండటాన్ని బట్టి, విజయ్ ప్యారిస్‌కు వెళ్తాడనీ, అక్కడ అతనికి ఇజా పరిచయమై, సన్నిహితమవుతుందనీ అర్థం చేసుకోవచ్చు. ఈ నలుగురిలో చివరకు అతను ఎవరిని స్వీకరిస్తాడనేది ఆసక్తికరమైన అంశం.
విజయ్ క్యారెక్టర్‌లో రకరకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. అతని రూపం చూస్తుంటే, 'అర్జున్‌రెడ్డి' మూవీ తలపుకు వస్తున్నప్పటికీ, నటుడిగా అతనికి ఈ సినిమా మరింత పేరు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. సున్నితమైన అంశాల్ని తెరకెక్కించడంలో డైరెక్టర్ క్రాంతిమాధవ్ మంచి ఎక్స్‌పర్ట్. 'ఓనమాలు', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాల ద్వారా తనలోని సెన్సిబిలిటీస్‌ని అతను చూపించాడు. ఇప్పుడు విజయ్ రూపంలో మంచి ఇమేజ్, క్రేజ్ ఉన్న హీరో లభించాడు కాబట్టి, ఈ అవకాశాన్ని అతను బాగా ఉపయోగించుకుంటాడనే విషయంలో సందేహించాల్సింది లేదు. ఒక యువకుడి జీవన యానంలోని వివిధ కోణాల్ని, ఆయా దశల్లో అతడు ఎదుర్కొనే సంఘటనలు, అతడికి తారసపడే స్త్రీలు, వాళ్లతో అతడి అనుబంధాల్ని ఈ సినిమాలో క్రాంతిమాధవ్ మన ముందు ఆవిష్కరించబోతున్నాడు. 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్ పెట్టడంలోనే విజయ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందనే విషయాన్ని అతను మనకు తెలియజేశాడు.
ఒక నిమిషం 13 సెకన్ల నిడివి ఉన్న 'వరల్డ్ ఫేమస్ లవర్' మనకు చాలా సంగతులే చెబుతోంది. విజయ్ మరోసారి బోల్డ్ అండ్ రెబల్ క్యారెక్టర్‌లో దర్శనమివ్వనుండగా, ఒక మెచ్యూర్డ్ లవర్ క్యారెక్టర్‌లో రాశీ ఖన్నా కనిపించనున్నది. ఐశ్వర్య అమాయకత్వం మూర్తీభవించిన భార్యగా ఆకట్టుకోనున్నది. ఇక క్యాతరిన్, ఇజాబెల్లే ఇద్దరూ.. హీరో జీవితంలోకి వచ్చి, కొంతకాలం తర్వాత తప్పుకొనే పాత్రల్లో అలరించనున్నారు. గోపిసుందర్ సంగీతం, జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్లుగా నిలవనున్నాయి. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్. రామారావు ప్రెజెంట్ చేస్తోన్న 'వరల్డ్ ఫేమస్ లవర్' వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న మనముందుకు వస్తోంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



