2020 షురూ: వివాదాలతో... ఫ్లాప్ సిన్మాలతో!
on Jan 3, 2020

టాలీవుడ్‌కి ఏమైంది? ఓ పక్క వివాదాలు... మరో పక్క ఫ్లాప్ సిన్మాలు! ఇదే విధంగా కొనసాగితే... భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. 2020 మొదలైంది. కానీ, టాలీవుడ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విధానం ఏమాత్రం బాగోలేదు. థియేటర్లలో సిన్మాలతో ఎంటర్‌టైన్ చేయాల్సివాళ్ళు... మీడియా సాక్షిగా మాటల కత్తులతో వినోదం పండిస్తున్నారు. కొత్త సినిమాలతో బోణీ కొట్టాల్సినవాళ్ళు... బోల్తా పడుతున్నారు.
వంద గంటలైనా కాలేదు... 2020 మొదలై! ఈలోపే ఇన్నాళ్ళు నివురు గప్పిన నిప్పులా ఉన్న మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో వివాదాలు ‘మా’ డైరీ ఆవిష్కరణలో బయటపడ్డాయి. రాజశేఖర్ ఎపిసోడ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ‘మా’కు ఆయన రాజీనామా చేయడమూ హైలైట్ అయింది. ఈ ఎపిసోడ్‌లో చిరంజీవి, మోహన్‌బాబు, మురళీమోహన్ వంటి పెద్దలు ఉండడం, వాళ్ళ మాటలు... ప్రతిదీ ప్రేక్షకులు గమనించారు. మోహన్ బాబుకు చిరు ముద్దు ఇవ్వడంతో సహా! కొత్త సినిమాల కంటే ‘మా’ డైరీ ఆవిష్కరణలో చోటు చేసుకున్న సన్నివేశాలు ప్రేక్షకులకు వినోదం పంచాయి.
మీడియా కంటికి దూరంగా జరుగుతున్న మరో వ్యవహారమూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ విడుదల తేదీ తకరారు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మొదట్లో విడుదల తేదీలతో పోస్టర్లు విడుదల చేసిన ‘అల..’ టీమ్, ‘హ్యాపీ న్యూ ఇయర్’ పోస్టర్లలో విడుదల తేదీ వేయలేదు. సెన్సార్ పూర్తయిందని చెప్పిన పోస్టర్‌లోనూ ‘సంక్రాంతి విడుదల’ అని మాత్రమే ఇచ్చారు. ఆరా తీయగా... అసలు విషయం బయటకొచ్చింది. థియేటర్ల పంపకాల్లో రెండు టీమ్స్ మధ్య తేడా వచ్చింది. దాంతో జనవరి 12న వద్దామనుకున్న అల్లు అర్జున్ టీమ్... మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలవుతున్న జనవరి 11కి రావాలని భావిస్తున్నట్టు లీకులు ఇచ్చింది. దాంతో చర్చలు మొదలయ్యాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాతల్లో ఒకరైన ‘దిల్’ రాజు... ‘అల వైకుంఠపురములో’ నైజామ్, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ కూడా! ఆయన రెండు టీమ్స్ మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. శనివారం సాయంత్రానికి ఈ గొడవ ఓ కొలిక్కి రావొచ్చు.
కొత్త సినిమాల విషయానికి వస్తే... జనవరి 1న హీరోయిన్ నైనా గంగూలీతో రామ్‌గోపాల్ వర్మ స్టెప్పులు వేసి మరీ ప్రమోట్ చేసిన ‘బ్యూటిఫుల్’ విడుదలైంది. పబ్లిసిటీకి మాత్రమే పరిమితమైన వర్మ సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరింది. జనవరి 1న వచ్చిన ‘ఉల్లాల ఉల్లాల’కు వందశాతం హిట్ టాక్ రాలేదు. డబ్బింగ్ సినిమాల్లో... ధనుష్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘తూటా’, మమ్ముట్టి హీరోగా నటించిన ‘రాజా నరసింహా’కు నెగిటివ్ మార్కులే పడ్డాయి. కన్నడ హీరో రక్షిత్ శెట్టి, శాన్వీ శ్రీవాస్తవ జంటగా నటించిన ‘అతడే శ్రీమన్నారాయణ’ కొంతమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
‘నమస్తే నేస్తమా’, ‘ఉత్తర’, ‘హల్‌చల్’, ‘వైఫై’ చిత్రాలు జనవరి 3న విడుదలయ్యాయని చాలామంది తెలియదు. వీటిని చూసిన ప్రేక్షకులూ పెదవి విరిచారు. మొత్తం మీద 2020 స్టార్టింగ్ ఏమాత్రం బాగోలేదు. సంక్రాంతికి వచ్చే సినిమాలతో హిట్ కళ, కొత్త ఏడాది కళ రావాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



