'వరల్డ్ ఫేమస్ లవర్' అయినా, 'ఎక్స్ వై జడ్' అయినా నాకు ఒకటే!
on Feb 11, 2020

టికెట్లు అమ్ముడవుతుంటే, జనం చూడ్డానికి ఇష్టపడుతుంటే సినిమా టైటిల్ ఏదైనా ఒకటే అంటున్నాడు విజయ్ దేవరకొండ. 'వరల్డ్ ఫేమస్ లవర్' అని పెట్టినా, 'ఎక్స్ వై జడ్' అని పెట్టినా తనకు ఇబ్బందేమీ లేదని చెప్తున్నాడు. మంగళవారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టైటిల్ గురించి అడిగినప్పుడు "కథానుసారం కొన్ని టైటిల్స్ పరిశీలించాం. అయితే అవి 1960ల కాలం నాటి టైటిల్స్ లాగా అనిపించాయి.. 'ప్రియం', 'ముంబై తీరం' లాంటివి అనుకున్నాం. వాటన్నింటి కంటే 'వరల్డ్ ఫేమస్ లవర్' బాగుందనిపించింది. స్క్రిప్ట్ ప్రకారమే ఆ టైటిల్ పెట్టాం. సినిమాకి ఆన్‌లైన్ బుకింగ్స్ బాగున్నాయి కాబట్టి, జనం దాన్ని చూడ్డానికి ఇష్టపడుతున్నారు కాబట్టి అంతకంటే కావాల్సింది ఏముంది! సినిమా టైటిల్ 'ఎక్స్ వై జడ్' అని పెట్టి టికెట్లు అమ్మినా నాకు హ్యాపీయే" అని తెలిపాడు విజయ్.
'వరల్డ్ ఫేమస్ లవర్' తన చివరి లవ్ స్టోరీ అని అతను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎవరైనా ఉన్నారా? అని అడిగితే, "ఇక లవ్ స్టోరీస్ చెయ్యనని అనౌన్స్ చెయ్యడం వెనుక ఎవరూ లేరు. అది నాకు నేను తీసుకున్న నిర్ణయం. నేను లవ్ స్టోరీస్ చెయ్యనంటే, అర్థం కమర్షియల్ సినిమాలే చేస్తానని కాదు. లవ్ స్టోరీలు చెయ్యనంటే లవ్ స్టోరీలు చెయ్యననే. 'టాక్సీవాలా' లాంటి సినిమా వస్తే చేస్తానేమో. కేవలం లవ్ చుట్టూ తిరిగే సబ్జెక్టులు చెయ్యాను. 'అర్జున్ రెడ్డి' ప్రీతి అనే అమ్మాయితో రిలేషన్‌షిప్ మీద తీసిన సినిమా. 'వరల్డ్ ఫేమస్ లవర్' నలుగురు అమ్మాయిలతో రిలేషన్‌షిప్ మీద నడిచే స్టోరీ. వీటిలోని స్టోరీ రిలేషన్‌షిప్ మీదే నడుస్తుంది. ఇలాంటివి ఇక చెయ్యాను. పూరి జగన్నాథ్ గారి సినిమాలోనూ చిన్న లవ్ త్రెడ్ ఉంటుంది. కానీ సినిమా కథ నడిచేది వేరే అంశం మీద" అని చెప్పాడు విజయ్.
ఒక వ్యక్తిగా తను మారుతున్నాననీ, ఒక దశలోంచి ఇంకో దశలోకి వెళ్తున్నాననీ.. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాననీ అతనంటున్నాడు. ఏ మనిషికైనా జీవితంలో రకరకాల దశలుంటాయనీ, లవ్ స్టోరీలు చేసే దశ దాటి ముందుకెళ్తున్నాననీ విజయ్ తెలిపాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



