శివశంకర్ మాస్టర్‌కు కొవిడ్.. పరిస్థితి విషమం!
on Nov 24, 2021
పాపులర్ కొరియోగ్రాఫర్.. మూడు తరాల హీరోల పాటలకు డాన్స్ కంపోజ్ చేసిన శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఐదు రోజుల నుంచీ హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్ సోకిందని వైద్యులు చెబుతున్నారు. శివశంకర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లు సమాచారం. ఆయన భార్య హోమ్ క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతుండగా, పెద్దకుమారుడు సైతం కొవిడ్‌తో బాధపడుతూ అపస్మారక స్థితిలో ఉన్నాడు. తండ్రిలాగా కొరియోగ్రాఫర్ అయిన అజయ్‌కృష్ణ ఒక్కడే మిగతా ముగ్గురి బాగోగులను దగ్గరుంచి చూసుకుంటున్నట్లు సన్నిహితులు తెలిపారు.
ప్రస్తుతం శివశంకర్‌కు అందిస్తోన్న చికిత్స ఖరీదైంది కావడంతో బిల్లులు చెల్లించడానికి ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొంటోన్న వారి కుటుంబానికి నటుడు సోను సూద్ చేయూత అందిస్తున్నారు. ఆయనను బతికించడానికి తన వంతుగా శాయశక్తులా కృషి చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
శివశంకర్ మాస్టర్ డాన్స్‌కి తెలుగులోనే కాకుండా తమిళ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. హిందీలోనూ కొన్ని పాటలకు కొరియోగ్రఫీ అందించారు. ‘మగధీర’, ‘బాహుబలి’, ‘అత్తారింటికి దారేది’ ఇలా వందలాది చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. డాన్స్ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. నటుడుగా కూడా ఆయన పలు సినిమాలలో కనిపించారు.
Also Read