'తులసిదళం'కి సీక్వెల్ ఆర్జీవీ 'తులసితీర్థం'!
on Nov 25, 2021

స్టార్ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ రచించగా, మూడు దశాబ్దాల క్రితం తెలుగు పాఠకులను ఉర్రూతలూగించిన హారర్ నవల 'తులసీదళం'. 1980లో ఆంధ్రభూమి వారపత్రికలో సీరియల్‌గా 'తులసిదళం' ప్రచురితమైనప్పుడు అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మరోవైపు హేతువాదులు ఈ నవలను సమాజంలో తిరోగామి భావాలను ప్రేరేపించేదిగా ఉందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నవలపై అనేక చర్చలు జరిగాయి. నవలగా పబ్లిష్ అయినప్పుడు కూడా 'తులసీదళం' చరిత్ర సృష్టించింది. ఆ నవల ఆధారంగా కన్నడలో 'తులసీదళ' (1985), తెలుగులో 'కాష్మోరా' (1986), హిందీలో 'ఫూంక్' (2008) సినిమాలు వచ్చాయి.
కాగా ఇప్పుడు ఆ నవలకు సీక్వెల్‌గా 'తులసీతీర్థం' కథ రాశారు యండమూరి. ఇదివరకు 'ఫూంక్'ను డైరెక్ట్ చేసిన రామ్‌గోపాల్ వర్మ.. ఇప్పుడు 'తులసీతీర్థం' కథతో, అదే టైటిల్‌తో సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీని భీమవరం టాకీస్ బ్యానర్‌పై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించనున్నారు.
గురువారం తన ఆఫీసులో 'తులసీతీర్థం' టైటిల్ లోగో పోస్టర్‌ను వర్మ ఆవిష్కరించారు. రైటర్ యండమూరి, ప్రొడ్యూసర్ రామసత్యనారాయణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతి త్వరలో సెట్స్‌కు వెళ్లనున్న ఈ హారర్ థ్రిల్లర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



