పావలా శ్యామల ప్రస్తుత పరిస్థితి ఇదే!
on May 17, 2021
గయ్యాళి పాత్ర అయినా, అమాయకపు బామ్మ పాత్రయినా, హాస్య పాత్రయినా తనదైన శైలి అభినయంతో ఆకట్టుకొంటూ, ప్రేక్షకుల్ని అలరిస్తూ వచ్చిన పావలా శ్యామల ప్రస్తుతం సినిమాలు చేసే ఓపిక లేక, ఆర్థిక స్థితి బాగోలేక నానా అవస్థలూ పడుతున్నారు. వృధ్యాప్య సమస్యలకు తోడు, అనారోగ్యవంతురాలైన కూతుర్ని చూసుకోవాల్సి రావడంతో ఆమె దురవస్థ వర్ణనాతీతం.
ఆమె పరిస్థితికి చలించి టాలీవుడ్‌కు చెందిన కొంతమంది సెలబ్రిటీలు ఆర్థిక సాయం చేశారు. చిరంజీవి రూ. 2 లక్షలు, పవన్ కల్యాణ్ రూ. 1 లక్ష సాయం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా పెన్షన్ రూపేణా రూ. 10 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె కట్టుకోవాల్సి రావడంతో ఆమె ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల క్రితం ఆమె దీన స్థితి ఎలా ఉందో కరాటే కల్యాణి లైవ్‌లో చూపించారు. ఆమెను ఆదుకోవాలంటూ కల్యాణి ఇచ్చిన పిలుపుతో కొంతమంది స్పందించి తమకు తోచిన రీతిలో విరాళాలు అందజేశారు. వాటిని స్వయంగా శ్యామలకు అందజేశారు కల్యాణి.
మనసంతా నువ్వే, ఖడ్గం, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అనసూయ, గోలీమార్, గుంటూరు టాకీస్, మత్తు వదలరా లాంటి అనేక చిత్రాల్లో నటించి, కనిపించినంత సేపూ మన దృష్టిని తనవైపు తిప్పుకొనేలా చేసిన పావలా శ్యామల ప్రస్తుతం ఇంటి అద్దె కూడా సరిగా కట్టలేని స్థితికి వచ్చారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, అప్పట్నుంచే కష్టాల కడలిని ఈదడం ప్రారంభించిన శ్యామల పెళ్లయి కూతురు పుట్టాక భర్తనూ కోల్పోయారు. ఒంటరి తల్లిగా కూతుర్ని పెంచుకుంటూ వచ్చారు. వృద్ధాప్యంలోనూ ఆ కూతుర్ని చూసుకోవాల్సి రావడంతో ఆమె బాధలు అన్నీ ఇన్నీ కావు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆమెను ఆదుకుంటే కొంతవరకు ఆమె పరిస్థితి మెరుగుపడే అవకాశాలున్నాయి.
Also Read