ఎన్టీఆర్ `వేటగాడు`కి 42 ఏళ్ళు!
on Jul 5, 2021

నటరత్న నందమూరి తారక రామారావు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ అంటేనే సెన్సేషనల్ హిట్స్ కి కేరాఫ్ అడ్రస్. అలాంటి వీరి కలయికలో వచ్చిన సంచలన చిత్రాల్లో `వేటగాడు` ఒకటి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా అతిలోక సుందరి శ్రీదేవి నటించింది. అంతకుముందు.. ఎన్టీఆర్ కి మనవరాలిగా `బడిపంతులు` (1972)లో ముద్దుముద్దు మాటలతో మురిపించిన బేబి శ్రీదేవి.. ఏడేళ్ళ తరువాత అతని సరసన కుమారి శ్రీదేవిగా ఆడిపాడడం అప్పట్లో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయింది. మరీముఖ్యంగా.. ఇందులోని ``ఆకుచాటు పిందె తడిసె`` అంటూ సాగే వాన పాటలో ఎన్టీఆర్, శ్రీదేవి మధ్య కెమిస్ట్రీకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ పాట కోసం పదే పదే థియేటర్ల వైపు పరుగులు పెట్టారు.
ఎన్టీఆర్ నటన, శ్రీదేవి గ్లామర్, దర్శకేంద్రుడి నిర్దేశకత్వం, చక్రవర్తి బాణీలు.. వెరసి `వేటగాడు` 1979 హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అలాగే 409 రోజులకి పైగా ప్రదర్శితమై వార్తల్లో నిలిచింది. అంతేకాదు.. `అడవి రాముడు` లాంటి ఇండస్ట్రీ హిట్ థియేట్రికల్ రన్ రికార్డ్ ని అధిగమించడమే కాకుండా.. అత్యంత వేగంగా రూ. కోటి గ్రాస్ ఆర్జించిన తెలుగు చిత్రంగా అప్పట్లో సరికొత్త రికార్డుని నమోదు చేసింది.
రావుగోపాలరావు, జగ్గయ్య, కాంతారావు, పుష్పలత, అల్లు రామలింగయ్య, చలపతిరావు, నగేశ్, పండరీబాయి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన `వేటగాడు`కి జంధ్యాల రచన మరో ప్రధాన బలంగా నిలిచింది. అలాగే చక్రవర్తి సంగీతానికి వేటూరి అందించిన సాహిత్యం.. ఆడియోని మరో స్థాయికి తీసుకెళ్ళింది. ``ఆకు చాటు పిందె తడిసె``తో పాటు ``బంగారు బాతు గుడ్డు``, ``జాబిలితో చెప్పనా``, ``ఓసోసి పిల్లకోడి పెట్ట``, ``కొండమీద చందమామ``, ``పుట్టింటోళ్ళు తరిమేశారు``.. ఇలా ఇందులోని పాటలన్నీ అప్పటి యువతరాన్ని ఉర్రూతలూగించాయి. రోజా మూవీస్ పతాకంపై ఎం. అర్జునరాజు, కె. శివరామరాజు నిర్మించిన `వేటగాడు`.. హిందీలో `నిషానా` (జితేంద్ర, పూనమ్ థిల్లాన్) పేరుతో రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే రూపొంది అక్కడా మంచి విజయం సాధించింది. 1979 జూలై 5న విడుదలై అఖండ విజయం సాధించిన `వేటగాడు`.. నేటితో 42 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



