'నారప్ప'గా మారిన వెంకటేశ్
on Jan 22, 2020
2019 ఆరంభంలో 'ఎఫ్2', ముగింపులో 'వెంకీ మామ' సినిమాలతో అలరించిన విక్టరీ వెంకటేశ్, 2020లో 'నారప్ప'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ధనుష్ నటించగా తమిళంలో సూపర్ హిట్టయిన 'అసురన్'కు ఇది రీమేక్. 'కొత్త బంగారులోకం', 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ ఒరిజినల్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్. థానుతో కలిసి డి. సురేశ్ బాబు నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం 'నారప్ప'గా వెంకటేశ్ ఎలా ఉంటారో వెల్లడిస్తూ పలు పోస్టర్లను విడుదల చేసింది. వీటిలో నెరిసిన గడ్డం, బుర్ర మీసాలు, తలగుడ్డతో నడివయసులో ఉన్న వెంకటేశ్ కనిపిస్తున్నారు. ఒక దాంట్లో బల్లెం పట్టుకొని, మరో దాంట్లో కొడవలి పట్టుకొని ఫెరోషియస్ లుక్‌లో ఆయన ఆకట్టుకుంటున్నారు. తెలుగులో ఇప్పటికే రీమేక్ కింగ్‌గా పేరుపొందిన వెంకటేశ్.. 'నారప్ప' రోల్‌లో ప్రేక్షకుల్ని అలరించడం ఖాయమనే పాజిటివ్ బజ్ అప్పుడే మొదలైపోయింది.
వెంకటేశ్ జోడీగా జాతీయ ఉత్తమనటి ప్రియమణి నటిస్తున్న ఈ సినిమా కథ: వెట్రిమారన్, పాటలు: సీతారామశాస్త్రి, సుద్ధాల అశోక్‌తేజ, అనంత శ్రీరాం, కృష్ణకాంత్, కాకర్ల శ్యాం, సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శ్యాం కె. నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, ఫైట్స్: పీటర్ హెయిన్, విజయ్, ఆర్ట్: గాంధి నడికుడికర్, రచన, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.