'ఎఫ్ 3'లో రవితేజ?
on Jan 22, 2020
వింటేజ్ వెంకటేష్ మళ్లీ వెండితెర మీదకు వస్తే వసూళ్లు ఏ స్థాయిలో వస్తాయో చూపించిన చిత్రం 'ఎఫ్ 2'. వెంకీ కామెడీకి వరుణ్ తేజ్ కూడా తోడవడంతో బాక్సాఫీస్ దగ్గర కాసులు గలగల లాడాయి. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ... హీరోయిన్లలో తమన్నా, మెహరీన్ గ్లామర్ ప్రతిదీ కలిసొచ్చి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆల్రెడీ ఈ సినిమాకు సీక్వెల్ తీయనున్నట్లు వెంకటేష్, అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. 'ఎఫ్ 2' కి సీక్వెల్ గా 'ఎఫ్ 3' రానుంది. ఎఫ్ 2లో వెంకటేష్, వరుణ్ తేజ్ వుంటే 'ఎఫ్ 3'లో వారిద్దరితో పాటు మరో హీరోకి చోటుంది. ఆ హీరో రవితేజ అనే ఫిలిం నగర్ టాక్.
మాస్ మహారాజా రవితేజది యూనిక్ కామెడీ టైమింగ్. నటనలో చిన్నచిన్న చమక్కులతో నవ్వులు పూయించే గల సత్తా రవితేజ సొంతం. అనిల్ రావిపూడి రైటింగ్ కి రవితేజ యాక్టింగ్ తోడైతే ఎలా ఉంటుందో 'రాజా ది గ్రేట్' లో ప్రేక్షకులు చూశారు. ఇటు వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా 'ఎఫ్ 3'లో మరో హీరో రవితేజ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. ఏమవుతుందో చూడాలి. ప్రస్తుతం వెంకటేష్ 'నారప్ప' చేస్తున్నారు. తమిళంలో విజయవంతమైన 'అసురన్'కి రీమేక్ ఇది. రవితేజ 'క్రాక్' చేస్తున్నారు. వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నారు. ముగ్గురు తమ తమ సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.