అందరినీ ‘వశం’ చేసుకునే కథాంశమిది - యువ దర్శకుడు శ్రీకాంత్ చల్లా
on Jul 20, 2017
బెంజిమన్ ఫ్రాక్లిన్ కనిపెట్టిన ‘కరెంట్’... గ్రహంబెల్ కనుగొన్న ‘ఫోన్..’ రైట్ బ్రదర్స్ మస్తిష్కం నుంచి పుట్టుకొచ్చిన ‘విమానం’... ఇవన్నీ ఓ అద్భుతాలే. ఆ అద్భుతాలు నిజంగా జరిగాయి కాబట్టి.. అవి ఇప్పుడు మానవ జీవితంలో భాగాలయ్యాయి. అలా కాకుండా... అవి పుట్టక ముందు వాటి గురించి ఆలోచిస్తే... దాన్నే ఫిక్షన్ అంటారు. అలా రాబోయే అద్భుతాన్ని ముందే ఊహించి.. ఓ భిన్నమైన సైంటిఫిక్ ఫిక్షన్ కథాంశాన్ని ఇద్దరు కుర్రాళ్లు తయారు చేశారు. వారే శ్రీకాంత్ చల్లా, రోహిత్ మిశ్రా. ‘వశం’పేరుతో ఈ కథను తెరకెక్కించేశారు కూడా.
మిత్రుల్లో ఒకడైన శ్రీకాంత్ చల్లా ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించాడు. స్నేహితులు, సహోద్యోగులు ఓ 120 మంది కలిసి... 60 లక్షలు పోగు చేసి మరీ ఈ సినిమా తీశారంటే... శ్రీకాంత్ చల్లా పై, ఈ కథపై వారికున్న నమ్మకం ఏంటో అర్థమవుతుంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ.. కేవలం 20 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేశాడు శ్రీకాంత్. 1గం. 10 ని. నిడివి గల ఈ చిత్రం కథాంశం ఇప్పటివరకూ ఎవరూ వినని... కనని స్థాయిలో ఉంటుందని శ్రీకాంత్ నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు.
కెమికల్స్ వల్ల కొన్ని వండర్స్ జరుగుతాయి. సంగీతం వల్ల కూడా అద్భుతాలు జరుగుతాయి. అలాగే యోగా వల్ల కూడా. ఈ మూడిటి ఆధారంగా ఎదుటి వ్యక్తిని లొంగదీసుకునే అనూహ్యమైన శక్తిని సృష్టిస్తాడు ఓ వ్యక్తి. ఆ తర్వాత ఏమైందనేదే ఈ సినిమా కథాంశం. బ్లాక్ మేజిక్ మాత్రమే కాదు. ఇంకా ఆసక్తికరమైనవి ఇందులో చాలా ఉంటాయని శ్రీకాంత్ నమ్మకంగా చెబుతున్నాడు. స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే ఈ సినిమా స్టూడెంట్స్ కి బాగా నచ్చుతుందని శ్రీకాంత్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
నెల్లూరు జిల్లా బిట్రగుంటకు చెందిన శ్రీకాంత్ బీటెక్ చదివిన ఉన్నత విద్యావంతుడు. సినిమాలని అమితంగా ఇష్టపడే ఈ కుర్రాడు... ప్రతిష్టాత్మక సురేశ్ ప్రొడక్షన్ లోని స్ర్కిప్ట్ విభాగంలో పనిచేశాడు. ప్రవీణ్ సత్తార్ ‘చందమామ కథలు’ చిత్రం స్క్రిప్ట్ వర్క్ లో కూడా పాల్గొన్నాడు. స్వతహాగా కె.విశ్వనాథ్ అభిమాని, పుస్తక ప్రియుడు అయిన ఈ కుర్రాడు... తన తొలి ప్రయత్నమే ఇలా రియలిస్టిక్ అప్రోచ్ తో కూడుకున్న సైటిఫిక్ ఫిక్షన్ కథను ఎంచుకోవడం నిజంగా అభినందనీయం, థియేటర్ ఆర్టిస్ట్ కృష్ణేశ్వరరావు ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో వాసుదేవరావు, శ్వేతా వర్మ హీరోహీరోయిన్లు.
‘చెక్ దే ఇండియా’చిత్రానికి సహాయ ఛాయాగ్రహకునిగా పనిచేసిన దుర్గాప్రసాద్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి జోశ్యభట్ల శర్మ సంగీత దర్శకుడు. తొలి సినిమా సైంటిఫిక్ ఫిక్షన్ కథాంశాన్ని ఎంచుకున్న శ్రీకాంత్... తన రెండో ప్రయత్నం మాత్రం ‘చెక్ దే’తరహాలో క్రీడా నేపథ్యంతో ఉంటుందని చెబుతున్నాడు.
బెస్ట్ ఆఫ్ లక్ శ్రీకాంత్.