కంగనా రనౌత్ కు కత్తిగాయాలు
on Jul 20, 2017
కంగనా రనౌత్ కు కత్తి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ఇదేదో సినిమాలో భాగం అనుకుంటున్నారా? నిజంగానే కంగనాకు కత్తి గాయాలయ్యాయి. పైగా నుదురు మీద పదిహేను కుట్లు కూడా పడ్డాయి.
అసలు విషయం ఏంటంటే... ప్రస్తుతం ఆమె ‘మణికర్ణిక’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. నిన్న బుధవారం ఫిలింసిటీలో కంగనారనౌత్, నిహార్ పాండ్యా లపై యుద్ధ సన్నివేశాలను క్రిష్ తెరకెక్కించాడు. ఈ సమయంలోనే కత్తి విసిరే విషయంలో టైమింగ్ మిస్సవ్వడంతో కంగనా నుదురుపై నిహార్ పాండ్య కత్తి కోసుకుపోయింది. దాంతో హుటాహుటిన కంగనాను దగ్గరలో ఉన్న అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లిపోయారు చిత్ర యూనిట్ సభ్యులు. తప్పనిసరి పరిస్థితుల్లో కంగనాకు పదిహేను కుట్లు వేయాల్సొచ్చిందని డాక్టర్స్ చెప్పారు. గాయం లోతుగా ఉన్నందున ఓ మూడు రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం ఆమె అపోలో లోనే కోలుకుంటున్నారు. దాంతో తాత్కాలికంగా ‘మణికర్ణిక’ చిత్రం షూటింగ్ బ్రేక్ పడిది.
వీరనారి ఝాన్సీలక్ష్మీబాయ్ వీరనాథగా.. . ‘మణికర్ణిక’చిత్రం తెరకెక్కుతోంది. ఝాన్సీలక్ష్మి అసలు పేరు మణికర్ణిక. అందుకే ఈ సినిమాకు ఆ పేరు పెట్టారు. ఝాన్సీరాణి 1828లో వారణాసిలోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అందుకే... వారిణాసిలోని మణకర్ణిక ఘాట్ లో ఈ చిత్రం ఫస్ట్ పోస్టర్ ఆవిష్కరించారు క్రిష్.
క్రిష్ సూపర్ హిట్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కూడా శాతకర్ణి పుట్టిన కోటి లింగాలు గ్రామంలోనే జరిగిన విషయం తెలిసిందే. సెంటిమెంట్ నే ‘మణికర్ణిక’ విషయంలో కూడా కొనసాగించారు క్రిష్. కంగనా ఈ చిత్రానికి సైన్ చేసిన వెంటనే ‘ఇది నా చివరి సినిమా’అని స్టేట్మెంట్ ఇచ్చేసి సంచలనాన్ని తెరలేపారు. ఈ సినిమా తర్వాత తాను దర్శకురాలిగా కొనసాగుతానని కంగనా మీడియాకు వివరించారు.
2018 ఏప్రిల్ 27న విడుదల కానున్న ఈ చిత్రానికి శంకర్-ఇషాన్-లాయ్ త్రయం సంగీతం అందిస్తున్నారు. జీ స్టూడియోస్, కమల్ జైన్ సమర్పణలో కైరోస్ కొంటెంట్ పతాకంపై... సంజయ్ కుట్రి, నిషాన్ పిట్టి సహ నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరో విశేషం ఏంటంటే..‘బాహుబలి’లాంటి సన్సేషనల్ సీరిస్ కి కథను అందించిన విజయేంద్రప్రసాద్ ‘మణకర్ణిక’కు కథకుడు కావడం.
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ దర్శకుడు క్రిష్, ‘బాహుబలి’ కథా రచయిత విజయేంద్రప్రసాద్ కలిసి పనిచేస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది.
Also Read