అక్కడ 'అల వైకుంఠపురములో' పైచేయి!
on Jan 20, 2020
మహేశ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ సినిమా 'అల వైకుంఠపురములో' బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి కోడి పుంజుల్లా తలపడుతున్న విషయం తెలిసిందే. మిక్స్డ్ టాక్‌లోనూ 'సరిలేరు' భారీ కలెక్షన్లు సాధిస్తుండగా, ఫుల్ పాజిటివ్ టాక్‌తో 'అల' వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల విషయంలో రెండు సినిమాల నిర్మాతలు వెల్లడిస్తున్న కలెక్షన్లపై ట్రేడ్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఎదుటి సినిమా కంటే తమ సినిమాయే వసూళ్లు విషయంలో టాప్‌లో ఉందని చెప్పుకోవడమే ధ్యేయంగా లేని వసూళ్లను ఉన్నట్లుగా చూపిస్తున్నారని వాళ్లు విమర్శిస్తున్నారు. మొదట 'సరిలేరు' నిర్మాతలు తమ సినిమా వసూళ్లను ప్రకటించడం, ఆ తర్వాత దానికంటే ఎక్కువ వసూళ్లు వచ్చినట్లుగా 'అల' ప్రొడ్యూసర్లు లెక్కలు ప్రకటించడం చూసి.. టాలీవుడ్ జనాలు విస్తుపోతుంటే, మహేశ్, బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా కొట్లాడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి 'కలెక్షన్ వార్' చూడలేదని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్నట్లే, ఈ హీరోల ఫ్యాన్స్ కొట్టుకుంటున్నట్లుగా ఉందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.
కేవలం పంతాలకు పోయి ఈ రకమైన అనారోగ్యకర వాతావరణాన్ని పెంచి పోషించడం తగదని ఇండస్ట్రీ పెద్దలు కూడా చెబుతున్నారు. అటు మహేశ్, ఇటు అల్లు అర్జున్ కూడా బాధ్యతతో వ్యవహరించకుండా, కలెక్షన్ల విషయంలో తమ సినిమాదే పైచేయి అని చెప్పడానికి ఆసక్తి చూపుతున్నారని వాళ్లు విమర్శిస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఏదో ఒకరోజు వాస్తవం వెల్లడి కాకుండా ఉండదు. అప్పుడు ఎవరు అబద్ధాన్ని నిజం చెయ్యడానికి ప్రయత్నించారో వాళ్ల క్రెడిబిలిటీ దెబ్బతినకుండానూ ఉండదు. టాప్ స్టార్ రేంజిని ఎంజాయ్ చేస్తున్న ఇద్దరు హీరోలు కూడా రికార్డులపై దృష్టిపెట్టి అవాస్తవాలను ప్రోత్సహించడం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏ రకంగానూ మంచిది కాదు. కాగా, ఈ రెండు సినిమాల కలక్షన్ల విషయంలో దిల్ రాజు నలిగిపోతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఎందుకంటే, ఈ రెండు సినిమాలకీ నైజాం, ఉత్తరాంధ్ర ఏరియాలకు ఆయనే డిస్ట్రిబ్యూటర్. అంతే కాదు, 'సరిలేరు' ప్రొడక్షన్‌లోనూ ఆయనకు వాటా ఉంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాల అసలు కలెక్షన్ల విషయంలో నిజాలు చెప్పలేని స్థితిలో ఆయన పడిపోయారు.
ఒకటి మాత్రం వాస్తవం. యు.ఎస్.లో 'సరిలేరు' మూవీ కంటే, 'అల' మూవీ పైచేయి సాధించింది. శనివారం నాటికి 'అల' సినిమా 2.5 మిలియన్ డాలర్ల గ్రాస్‌ను అందుకోగా, ఆ సినిమా కంటే ఒక రోజు ముందే విడుదలైన 'సరిలేరు' 2 మిలియన్ డాలర్ల మార్కును సాధించగలిగింది. డైరెక్టర్ త్రివిక్రమ్ కెరీర్‌లో యు.ఎస్.లో ఒక సినిమా 2.5 మిలియన్ డాలర్లు సాధించడం ఇదే ప్రథమం. ఆయన మునుపటి బెస్ట్ కలెక్షన్లు 'అ ఆ' సినిమా సాధించిన 2.44 మిలియన్ డాలర్లే. 'అల' సినిమా వచ్చేవారం 3 మిలియన్ డాలర్ల మార్కును సునాయాసంగా చేరుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవరాల్‌గా యు.ఎస్. టాప్ తెలుగు గ్రాసర్స్‌లో ఈ సినిమా 8వ స్థానంలో ఉంది. అల్లు అర్జున్ కెరీర్‌లోనూ దీనిదే అగ్ర స్థానం.
మరోవైపు వీక్‌డేస్‌లో బాగా నెమ్మదించిన 'సరిలేరు' మూవీ శనివారం పుంజుకొని లక్ష డాలర్లను ఆర్జించడంతో ఓవరాల్‌గా దాని కలెక్షన్లు యు.ఎస్.లో 2 మిలియన్ డాలర్ మార్కును చేరుకున్నాయి. యు.ఎస్. బాక్సాఫీస్ దగ్గర ఈ ఫీట్ సాధించిన మహేశ్ మూడో సినిమా 'సరిలేరు' కావడం గమనార్హం. ఇదివరకు 'భరత్ అనే నేను' మూవీ 3.4 మిలియన్ డాలర్లు, 'శ్రీమంతుడు' సినిమా 2.89 మిలియన్ డాలర్లు వసూలు చేశాయి. వీటిలో 'భరత్ అనే నేను' ఓవరాల్ టాప్ తెలుగు గ్రాసర్స్‌లో నాలుగో స్థానంలో ఉంది కూడా. దాని కంటే ముందున్న సినిమాలు.. 'బాహుబలి 2', 'బాహుబలి', 'రంగస్థలం'. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి విషయానికి వస్తే, 'సరిలేరు' అతనికి యు.ఎస్.లో వరుసగా రెండో 2 మిలియన్ డాలర్ సినిమా. అతని మునుపటి సినిమా 'ఎఫ్2' కూడా 2 మిలియన్ డాలర్లను రాబట్టింది.
సంక్రాంతి సినిమాల్లో తమ సినిమాదే అగ్ర స్థానం అని చెప్పుకోడానికి అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల, ఫ్యాన్స్ మధ్య లేనిపోని గొడవలు జరగడానికి నిర్మాతలే కారణమవుతున్నారని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. ఒక సినిమా హిట్టయి, ఇంకో సినిమా ఫ్లాపైతే ఈ గొడవకు ఆస్కారం ఉండేది కాదు. కానీ బాక్సాఫీస్ దగ్గర రెండు సినిమాలకూ ఆదరణ లభించడం వల్లే ఈ అనారోగ్యకర పోటీకీ, మొండిపట్టుదలకూ దారితీసింది. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఆ సినిమాల హీరోలదే. కానీ తమ ఫ్యాన్స్ ఎక్కడ నొచ్చుకుంటారోనని అటు మహేశ్, ఇటు బన్నీ ఈ విషయంలో ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఇవాళ టాప్ హీరోలంతా తమ అభిమానులకు బందీలే కదా!