నిర్మాతలు ఇచ్చిన చెక్కులు చించేశా- రవితేజ
on Jan 20, 2020
ఒకటి కాదు... రెండు కాదు... మూడు సార్లు నిర్మాతలు తనకు ఇచ్చిన చెక్కులు చించేశానని మాస్ మహారాజా రవితేజ అన్నారు. సినిమాలు ఫ్లాప్ కావడంతో నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకోకుండా వదిలేశానని ఆయన తెలిపారు. ఇప్పుడు ఈ టాపిక్ రవితేజ ఎందుకు మాట్లాడారంటే... రెమ్యూనరేషన్ విషయంలో మాస్ మహారాజా నిక్కచ్చిగా ఉంటాడనీ, అతడు అడిగినంత ఇవ్వకపోతే సినిమాలు వదిలేసుకున్న సందర్భాలు ఉన్నాయనీ విమర్శలు వచ్చాయి. ఓ దర్శకుడు 'చీప్ స్టార్' అన్నది అతని ఉద్దేశించే అనే ప్రచారం ఉంది. 'డిస్కో రాజా' ఈ నెల 24న విడుదల కానున్న సందర్భంగా కొన్ని పత్రికల వారికి రవితేజ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో అతడికి రెమ్యూనరేషన్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.
"నేను రెమ్యూనరేషన్ విషయంలో అంత పట్టుబడితే ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయగలిగే వాడిని కాదు. కచ్చితంగా చేసే వాడిని కాదు. మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా... ఓ నిర్మాత నా దగ్గరికి వచ్చారు. అతడితో సినిమాకు నా రెమ్యూనరేషన్ ఇంత అని మాట్లాడుకున్నాం. సినిమా విడుదలైన తర్వాత నాకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ చెక్ తీసుకొని వచ్చారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. పరిస్థితి తెలుసు. నిర్మాత ముందే ఆ చెక్ చించేశా. నాకు డబ్బులు వద్దని చెప్పాను. ఈ విధంగా మూడు సార్లు జరిగింది. ముగ్గురు వేర్వేరు నిర్మాతలు నాకు చెక్స్ ఇవ్వబోతే చించేశాను. ఆ సినిమాలో అంతగా ఆడలేదు అని. నాకు సంబంధం లేకుండా ఒక సమయంలో నేను రెమ్యునరేషన్ గురించి గట్టిగా పట్టుబడతానని హైలైట్ అయింది. ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్. పార్ట్ ఆఫ్ మై జాబ్ అని ఊరుకున్నాను" అని రవితేజ అన్నారు.
'డిస్కో రాజా' సినిమా గురించి రవితేజ మాట్లాడుతూ "దర్శకుడు విఐ ఆనంద్ నన్ను దృష్టిలో పెట్టుకునే ఈ కథ సిద్ధం చేశానని చెప్పాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఒక్కక్షణం వంటి డిఫరెంట్ హ్యాండ్ ఫిలిమ్స్ తీసిన అతడిలో ఇంత హ్యూమర్ ఉందని ఈ స్క్రిప్ట్ వినే వరకు నాకు తెలియలేదు. షూటింగ్ చేసినంత సేపు నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. రేపు థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకులు అంత ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.