మేం పిల్లల్ని కనకపోతే.. మీకు బాధేంటట?
on Aug 21, 2017
చక్కగా కలిసి కాపురం చేసుకుంటున్న జంటలు విడిపోతున్నారని రాసేయడం... ఎవరెవరికో లింకులు పెట్టి చంకలు గుద్దుసుకోవడం మీడియా వారికి పరిపాటేగా గోవిందా...!
సెలబ్రిటీల కాపురాలంటే... ఎంత చులకనో ఈ మీడియా వారికి. రేటింగులకు కోసం ఈ చీటింగులెందుకు చెప్మా? పాపం... రామ్ చరణ్, ఉపాసన పెళ్లి చేసుకొని అయిదేళ్లు నిండాయ్. ఆ ఆనందంలో వాళ్లుంటే... వారి కాపురానికి నూరేళ్లు నిండిపోయాయ్. వాళ్లు విడిపోతున్నారహో..! ఢంఖా బజాయించి మరీ టీవీల్లో ఊదేశారు. ఆ దంపతులు ఈ వ్యవహారం గురించి పెద్దగా పట్టించుకోలేదనుకోండీ. అది వేరే కథ. అయితే...మామయ్య చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా... కోడలు ఉపాసనా తన మనోభావాలను ఇటీవల బయటపెట్టేసింది. అలాంటి కుటుంబానికి కోడలిని అవ్వడం తన అదృష్టమని.. మామయ్య తనకిచ్చిన అపురూపమైన బహుమతి తన భర్త రామ్ చరణ్ అని ఎంతో ఉద్వేగానికి లోనవుతూ చెప్పింది ఉపాసన. ఇంకా ఏమేమి చెప్పిందో తెలుసా?
‘మా దంపతుల అన్యోన్యత విషయంలో మీడియా వారు తెగ బాధ పడిపోతున్నారు. పాపం.. వారు అంత బాధ పడల్సిన పనిలేదు. ఎందుకంటే... మేం చాలా బాగున్నాం. అందరిలా మేమూ సాధారణ దంపతులమే. మంచి స్నేహితులం కూడానూ. మా అభిప్రాయాలను బహిరంగంగా చెప్పే ధైర్యం మాకుంది. కానీ మా సంసారంలో ఇప్పటివరకూ అలాంటి అవసరం రాలేదు. రాదనే అనుకుంటున్నా. ఎందుకంటే... నా అత్తమామలు కానీ, నా భర్త కానీ నాపై చూపించే అక్కర, అభిమానం.. నేను పుట్టింట్లో కూడా పొందలేదు. ఇది నిజం. చివరకు నా భర్త అసిస్టెంట్లు, డ్రైవర్లు కూడా నా విషయంలో కేర్ గా ఉంటారు. నేను ఏం చేసినా భుజం తట్టి ప్రోత్సహించే మామగారు, నన్ను కూతురు కంటే ప్రేమగా చూసే అత్తగారు. నన్ను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే భర్త... ఇక నాకేం కావాలి చెప్పండి. నా అదృష్టం చూసి.. చాలా సందర్భాల్లో తెలీకుండానే ఆనందంతో నా కళ్లు చమర్చాయ్’అని భావోద్వేగానికి లోనైంది ఉపాసన.
ఇంకా చెబుతూ ‘మేం పిల్లల్ని కనకపోవడం కూడా మీడియాలో హాట్ టాపిక్కే. మేం కోరుకున్నప్పుడు పుట్టే మా పిల్లల గురించి వాళ్లకెందుకో బాధ నాకర్థం కావడంలేదు. పిల్లల విషయంలో మాకంటూ కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయ్. అది మా పర్సనల్ వ్యవహారం. ఇద్దరం పిల్లలు కావాలని అనుకున్నప్పుడు తప్పకుండా తల్లిదండ్రలమవుతాం. ఆ విషయంలో కేర్ తీసుకోవడానికి ‘అపోలో’సంస్థే మా వెనక ఉంది. ఈ విషయంలో ఎవరూ బాధ పడనవసరం లేదు’ అని నిర్మొహమాటంగా చెప్పేసింది ఉపాసన.
మరి కొన్ని ఆసక్తి విషయాల గురించి తను ప్రస్థావిస్తూ ‘నేను చరణ్ కి సరైన జోడీని కాను అని కూడా చాలామంది అన్నారని విన్నాను. నిజంగా ఆ విషయంలో నేను చాలా ఆనందపడ్డాను. కారణం.. మా ఆయనకు చాలామంది అమ్మాయిలు అభిమానులు. వారందరూ తనకు ‘బెస్ట్’ కావాలని కోరుకుంటున్నారు. అది నాకు గర్వకారణమే కదా. పెళ్లి సమయంలో నేను చాలా లావుండేదాన్ని. ఇప్పుడు ఎంతో శ్రమకోర్చి బరువు తగ్గాను. ఇప్పుడైతే... మా ఇద్దర్నీ చూసి అలాంటి అభిప్రాయాలను రావనే అనుకుంటున్నా’ అని చాలా కూల్ గా చెప్పింది ఉపాసన.
‘మామయ్య పుట్టిన రోజు మా ఇంటికి స్పెషల్. ఆ రోజు అభిమానులే కాదు, ఇంట్లో కూడా ఏదో ఒక కొత్త నిర్ణయాలు తీసుకోవడం రివాజు. అందుకే... ఈ పుట్టిన రోజు సందర్భంగా... మన ఫ్యామిలీని ఎల్లవేళలా సంతోషంగా ఉంచుతాననీ, బాధ అనేది కుటుంబం దరిదాపులకు కూడా రానీయ్యనని మామయ్యకు మాటిచ్చాను’ అని సంతోషంగా చెప్పింది ఉపాసన.
ఈ అమ్మాయి ఇంత క్లియర్ గా, క్లారిటీ ఇచ్చాక కూడా... వీరి దాంపత్యంపై గాలివార్తలు సృష్టిస్తే..!.. అనకూడదు కానీ.. సృష్టిస్తే ఏం చేస్తాం? వాళ్లు సృష్టించడం మామూలే... వీళ్లు వివరణలు ఇచ్చుకోవడం మామూలే. అంతా... మామూలే.