చిన్న సినిమా ట్రైలర్ కి అన్ని వ్యూసా?
on Aug 21, 2017
పెద్ద హీరోల సినిమాల ట్రైలర్లకు కోట్లలో వ్యూస్ రావడం కామనే. కానీ... ఓ చిన్న సినిమా ట్రైలర్ ను దాదాపుగా 40 లక్షల సార్లు చూశారంటే.. అది అద్భుతం కాక మరేంటి?. అలాంటి అద్భుతాన్నే సృష్టించింది ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్. ఇప్పటికి దాదాపు 40 లక్షల వ్యూస్ ఈ ట్రైలర్ కి వచ్చాయ్. ఇప్పటికీ... విపరీతంగా ట్రెండ్ అవుతున్న ట్రైలర్ ఇది. అసలు ఈ ట్రైలర్ లో గొప్పతనం ఏంటి? అనే విషయానికొస్తే...
‘సాధ్యమైనంతవరకూ.. తీసిన సినిమాలో ఏవి బాగున్నాయో... వాటిని ఏర్చీ, కూర్చీ.. ట్రైలర్లు తయారు చేస్తుంటారు’ అనే వాదన దర్శక, నిర్మాతలపై ఉంది. అది అపవాదో.. నిజమో అందులో పనిచేసేవాళ్లకే తెలియాలి. అయితే... ‘అర్జున్ రెడ్డి’సినిమా ట్రైలర్లో మాత్రం అనవసరపు హంగామాలు కాకుండా... కేవలం దర్శకుని అభిరుచిని మాత్రమే చూపిస్తోంది. ఈ ట్రైలర్ చూస్తున్న ఎవరికైనా సరే... మణిరత్నం సినిమా చూస్తున్న ఫీల్ కలగకమానదు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాని మణిరత్నం బాగా ప్రభావితం చేసినట్టున్నాడు. ఆ కెమెరా యాంగిల్స్... ఆ లైటింగ్... ఆ పాత్రల నడవడికలు... తీరుతెన్నులు... ఇంటర్ననల్ ఏదో ఉందనిపించే కథనం... ఇవన్నీ చూస్తుంటే మణిరత్నం... మౌనరాగం, గీతాంజలి... తదితర చిత్రాలు గుర్తొస్తాయ్. దాంతో సినిమా ఎప్పుడు చూస్తామా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలగడం కామనే. సంభాషణలు కూడా నిజానికి దగ్గరగా రాసుకున్నాడు సందీప్ రెడ్డి.
ఇక దర్శకుడు తర్వాత ఈ ట్రైలర్ లో చెప్పుకోవాల్సింది హీరో విజయ్ దేవరకొండ గురించే. ట్రైలర్ లో అతను యారగెంట్ పర్సన్ లా కనిపిస్తున్నాడు. మరో కోణంలో మూర్కుడిలా, ఇంకో కోణంలో ప్రేమికునిలా అనిపిస్తున్నాడు. ఇందులో తనది నిత్య సంఘర్షణలకు లోనయ్యే పాత్ర అని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. ఈ నెల 25న ‘అర్జున్ రెడ్డి’ చిత్రం విడుదల కానుంది.
మరి అందరూ అనుకున్నట్లు తీసిన సినిమాలో విషయమున్న అంశాలను ఏర్చి కూర్చి ఆ ట్రైలర్ తయారు చేశారా? లేక సినిమాలోనే విషయం ఉందా? అనేది తెలియాలంటే.. ఈ శుక్రవారం దాకా ఆగాల్సిందే.