`సోలో`గా నారా రోహిత్ అలరించి నేటికి పదేళ్ళు!
on Nov 25, 2021

వైవిధ్యభరితమైన చిత్రాలకు చిరునామాగా నిలిచిన కథానాయకుల్లో నారా రోహిత్ ఒకరు. అలాంటి రోహిత్ కి నటుడిగా గుర్తింపుని తీసుకువచ్చిన సినిమాల్లో `సోలో` ఒకటి. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రోహిత్ కి జంటగా కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ నటించింది. ప్రకాశ్ రాజ్, జయసుధ, సాయాజీ షిండే, అలీ, రావు రమేశ్, ఎమ్మెస్ నారాయణ, రవి ప్రకాశ్, ప్రవీణ్, పవిత్రా లోకేశ్, స్వప్నిక, రంగనాథ్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించగా.. ముమైత్ ఖాన్ ప్రత్యేక గీతంలో చిందులేసింది.
కథ విషయానికి వస్తే.. గౌతమ్ (నారా రోహిత్) ఓ అనాథ. అనాథాశ్రమంలో పెరిగిన గౌతమ్ కి.. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనేది ఓ కల. వైష్ణవి (నిషా అగర్వాల్) అచ్చంగా అలాంటి కుటుంబానికి చెందిన అమ్మాయే. మొదట్లో గౌతమ్ తో కస్సుబుస్సులాడినా.. క్రమంగా అతనితో ప్రేమలో పడుతుంది వైష్ణవి. వైష్ణవి ప్రేమ సంగతి తెలిసిన ఆమె తండ్రి (ప్రకాశ్ రాజ్) వారి పెళ్ళికి నిరాకరిస్తాడు. పలు మలుపుల అనంతరం గౌతమ్, వైష్ణవి ఎలా ఒక్కటయ్యారన్నదే మిగిలిన సినిమా.
సింపుల్ పాయింట్ చుట్టూ అల్లుకున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాని పరశురామ్ తన టేకింగ్, డైలాగ్స్ తో ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా తీర్చిదిద్దారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు, నేపథ్య సంగీతం ఈ ఫీల్ గుడ్ మూవీకి మరో ప్రధాన బలంగా నిలిచాయి. వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం.. ఒరియాలో `హాటా ధారి చాలుతా` పేరుతో రీమేక్ అయింది. 2011 నవంబర్ 25న విడుదలై జననీరాజనాలు అందుకున్న `సోలో`.. నేటితో 10 ఏళ్ళు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



