తాప్సి మొగుడిని కొట్టిందిగా...
on Feb 27, 2020
అవును... తాప్సి మొగుడిని కొట్టింది. అయితే... అది రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్‌లో! రియల్ లైఫ్‌లో ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు కదా! తెలుగులో గోపీచంద్ సరసన తాప్సి నటించిన సినిమాల్లో 'మొగుడు' ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ గుర్తుందా? ఒకవేళ ఎవరికైనా గుర్తు లేకపోతే యుట్యూబ్‌కి వెళితే, అందులో సినిమా ఉంది. చూడండి. పెళ్లి తర్వాత అమ్మాయి అప్పగింతల సీన్ అది.
పెళ్ళికొడుకు, పెళ్లి కుమార్తె కుటుంబాల మధ్య అభిప్రాయబేధాలు రావడంతో ఇరు వర్గాల వారు కొట్టుకుంటారు. కొట్టుకోవడం అంటే చెంపదెబ్బలు అన్నమాట. మొదట గోపీచంద్ బావను రోజా కొడుతుంది. 'మా అల్లుడిని కొడతావా? నువ్వసలు ఆడదానివేనా?' అని ఆమెను రాజేంద్రప్రసాద్ కొడతాడు. వెంటనే ఆమెను చెప్పు తీసుకుని రోజా కొడుతుంది. 'మా నాన్ననే కడతావా?' అని రోజాను గోపీచంద్ కొడతాడు. గోపీచంద్‌ని తాప్సి కొడుతుంది. ఇప్పుడీ సీన్ ప్రస్తావన ఎందుకంటే... హిందీలో తాప్సి ప్రధాన పాత్రలో నటించిన 'తప్పడ్' (చెంపదెబ్బ) ఈ శుక్రవారం (ఫిబ్రవరి 28న) విడుదలవుతోంది. ఆ సినిమా పబ్లిసిటీలో భాగంగా ఇటీవల తాప్సి ఒక ప్రమోషనల్ వీడియో చేసి రిలీజ్ చేశారు.
క్లుప్తంగా అందులో కంటెంట్ ఏంటంటే... "సినిమాల్లో ఎవరైనా సిగరెట్ కాల్చినా, మందు తాగినా 'సిగరెట్, మందు ఆరోగ్యానికి హానికరం' అని డిస్‌క్లైమర్ వేస్తున్నారు. జంతువులతో సన్నివేశాలు ఉంటె 'జంతువులను హింసించలేదు' అని కూడా డిస్‌క్లైమర్ వేస్తున్నారు. మరి, మహిళల మీద హింసను ప్రేరేపించేలా సన్నివేశాలు ఉంటే ఎందుకు డిస్‌క్లైమర్ వేయడం లేదు? సిగరెట్, మందు కంటే మహిళలు తక్కువా?" అని తాప్సి ప్రశ్నించారు. దీనిపై సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ సెటైర్స్ వేస్తున్నారు. "అమ్మా... 'మొగుడు'లో హీరోయిన్ నువ్వే కదా? ఇంటర్వెల్ సీన్ ఉంటుంది?" అని ఆమెకు గుర్తు చేస్తున్నారు. మగాళ్లను మహిళలు కొట్టే సన్నివేశాలు ఉంటే ఏం చేయాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. 'తాప్సి మొగుడిని కొట్టిందిగా' అని కామెంట్స్ చేస్తున్నారు.