
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 30న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘ఆదర్శ కుటుంబం’ కథ ఎలా ఉండబోతుందో వివరించారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ.. "కుటుంబం మనకి ఇవ్వబడుతుంది. స్నేహితులను మనం ఎంచుకుంటాం. ప్రేమ మనం కోరుకుంటాం. అలా ఒక ఇవ్వబడిన కుటుంబం, ఇవ్వబడిన బంధాలు, వాటిని కాపాడుకోవడానికి నలుగురు మనుషులు. చిట్టిబాబు, స్వర్ణ, సంపూర్ణ, సర్వ అనే నలుగురు మనుషులు ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడ్డారు? ఎంత దూరం వెళ్ళారు? ఒక సామాన్యుడు తెగిస్తే ఎంతదూరం ప్రయాణం చేయగలడు? అది ఈ సినిమా తాలూకు కథ.
ఇంకో మాటలో చెప్పాలంటే.. కృష్ణుడు గీత రెండుసార్లు చెప్పాడు. మొదటిది అర్జునుడికి కురుక్షేత్రం సమయంలో.. అది భగవద్గీత. రెండోవది ఉద్ధవుడికి కృష్ణుడు చెప్పిన గీత.. ఉద్ధవ గీత అంటారు. ఉద్ధవ గీతలో రాబోయే కాలంలో మనుషులు ఎలా ఉంటారు? వాళ్ళ తాలూకు మనస్తత్వాలు ఎలా ఉంటాయి? చెప్పాడు. మనుషుల్లో ఆశ, కోరిక, కలహ ప్రియత్వం ఈ మూడూ ఎక్కువగా ఉంటాయని చెప్పాడు. ప్రస్తుత ప్రపంచంలో మనుషులు అలాగే ఉన్నారు. ప్రపంచం ఇలా ఉంటుందని దాదాపు 5000 సంవత్సరాల క్రితమే ఉద్ధవ గీతలో కృష్ణుడు చెప్పాడు. అలాంటి పరిస్థితులు ఉన్న ఈ సమాజంలో కుటుంబం మాత్రమే మనకి ఇంకా తోడుగా ఉంది. అది కూడా ముక్కలైపోతే మనుషులు దేనికోసం బతకాలి. మనుషులు బతకడానికి ఒక పర్పస్ అయితే ఉండదు. అందుకే నేను కుటుంబ బంధాలను గానీ, కుటుంబ విలువలను గానీ అంతలా ఇష్టపడతాను. వాటి గురించి పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తాను.
'ప్రపంచమొక పద్మవ్యూహం - కవిత్వమొక తీరని దాహం' అన్నాడు శ్రీశ్రీ. కుటుంబం ఒక పద్మవ్యూహం.. అందులోకి అభిమన్యుడిలాగా వెళ్ళి, బయటకు రావడం తెలియక చనిపోతారా? అర్జునుడిలాగా వెళ్ళి గెలిచి విక్టోరియస్ గా బయటకు వస్తారా? అనేదే ఈ సినిమా మనకి చెప్తుంది." అన్నారు.
ఇది కూడా చదవండి: నారాయణమూర్తి సర్ప్రైజ్ ఎంట్రీ.. 'టెంపర్'ని కాదని 'హుషారు 2' చేయడానికి కారణమేంటి.?
[Trivikram Speech at Aadarsha Kutumbam Event, Aadarsha Kutumbam Pre Release Event, Aadarsha Kutumbam Movie Story, Aadarsha Kutumbam, Trivikram Speech, Trivikram Srinivas, Victory Venkatesh, Srinidhi Shetty, Telugu Film News]






