సంక్రాంతి సినిమాల పోటీపై త్రివిక్రమ్ మాటేమిటి?
on Jan 6, 2020
సంక్రాంతికి వస్తున్న 'సరిలేరు నీకెవ్వరు', 'అల... వైకుంఠపురములో' సినిమాలు నాలుగు రోజుల పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో 20-20 మ్యాచ్ ఆడుకున్నాయి. హీరోలు ఇగోలకు పోవడమో... మరొకటో... విడుదల తేదీల విషయంలో గందరగోళం నెలకొనడమో... ఏదైతే గానీ 2020 సంక్రాంతి పేరు చెబితే ఇప్పట్లో కొన్నేళ్లు మరిచిపోలేని విధంగా తయారైంది. మరోపక్క సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా ఈ రెండు సినిమాల మధ్యే పోటీ అన్నట్టు మాటల కత్తులు దూసుకుంటున్నారు. మరి, దర్శకుడు త్రివిక్రమ్ ఈ పోటీపై ఏమన్నారో తెలుసా?
"సంక్రాంతికి వచ్చేవి సినిమాలు... పందెం కోళ్లు కాదు కదా! పోటీ పడడానికి. సంక్రాంతి సినిమాల మధ్య యుద్ధ వాతావరణం ఏమీ లేదు. ప్రశాంతంగానే ఉంది. సంక్రాంతికి వచ్చే సినిమాలను ప్రేక్షకులు కూడా పోటీగా తీరుకోరు" అని ప్రముఖ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ అన్నారు.
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ 'అతడు', 'ఖలేజా' సినిమాలు చేశారు. ఇటు అల్లు అర్జున్ హీరోగా ఆయనకు 'అల వైకుంఠపురములో' మూడో సినిమా. ఇంతకు ముందు 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' చేశారు. ఇద్దరి హీరోలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. అందుకని పోటీ లేదని తేల్చేశారు. నిజానికి, పోటీ ఏ స్థాయిలో ఉందో... యుద్ధ వాతావరణం నెలకొందో... లేదో... ఆయనకు తెలియనిదా ఏంటి.