వాళ్ళిద్దరినీ మళ్లీ మహేష్ కలిపాడు!
on Jan 6, 2020
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి... విజయశాంతిది హిట్ జోడి. ఇద్దరూ దాదాపుగా 20 చిత్రాల్లో నటించారు. వాటిలో ఎక్కువ శాతం ఘన విజయాలు సాధించాయి. ఎక్కువ చిత్రాల్లో కలిసి నటించడం... పైగా హిట్ జోడి కావడంతో... ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే... రాజకీయాలు ఈ స్నేహాన్ని విడదీశాయి. చిరంజీవిపై విజయశాంతి రాజకీయ పరమైన విమర్శలు చాలా చేశారు. ఘాటైన వ్యాఖ్యలు చాలా చేశారు. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. పదిహేనేళ్లుగా ఇద్దరి మధ్య మాటలు లేనే లేవు. ఈ విషయం చిరంజీవి చెబితేనే తెలిసింది. మళ్లీ ఈ స్నేహితులు ఇద్దరిని ఒక్కటి చేసిన ఘనత మహేష్ బాబుది. వాళ్ళిద్దర్నీ మహేష్ కలిపాడు.
మహేష్ నటించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఇందులో ప్రొఫెసర్ భారతీగా కీలక పాత్రలో విజయశాంతి నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం రాత్రి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగింది. దీనికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన విజయశాంతితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చెన్నైలోని టి నగర్ లో తన ఇంటి ముందే విజయశాంతి ఉండేవారిని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ "రాజకీయాల్లో నన్ను ఎన్ని మాటలు అన్నావ్. అన్ని మాటలు ఎలా అనాలి అనిపించింది? నేను ఏ రోజైనా నిన్ను ఒక మాట అన్నానా?" అని విజయశాంతిని ప్రశ్నించారు. "నా వెనుక ఏమన్నారో?" అని విజయశాంతి అనగా... "నీ ముందు అనలేనివాడిని వెనక ఏమంటాను?" అని చిరంజీవి నవ్వేశారు. "రాజకీయాలు వేరు... సినిమాలు వేరు... మీరు ఎప్పటికీ నా హీరో" అని విజయశాంతి అనడంతో స్టేడియం మొత్తం చప్పట్లు ఈలలతో మార్మోగింది.
'సరిలేరు నీకెవ్వరు' ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి - విజయశాంతి సంభాషణ హైలైట్ గా నిలిచింది. "రాజకీయాలు స్నేహితులని దూరం చేస్తే... సినిమాలు మళ్లీ దగ్గర చేశాయి. ఇన్నేళ్ల తర్వాత విజయశాంతి ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనంతటికీ కారణం మహేష్" అని చిరంజీవి అన్నారు. ఇలా వాళ్ళిద్దరినీ కలిపిన ఘనత మహేష్ సొంతమైంది. చిరు - విజయశాంతి ఆత్మీయ కౌగిలింత సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీటిపై చాలా మీమ్స్ వచ్చాయి. కొందరు పాజిటివ్ మీమ్స్ చేస్తే... మరికొందరు నెగిటివ్ మీమ్స్ చేశారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా హైలెట్ కాకుండా... చిరంజీవి విజయశాంతి మధ్య స్నేహం హైలైట్ అయిందని మహేష్ బాధపడుతున్నట్టు ఇంకొందరు మిమ్స్ చేశారు.
Also Read