టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి!
on Jan 9, 2024
చిత్ర పరిశ్రమను వరస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా ప్రముఖులు వివిధ కారణాలతో కన్ను మూస్తున్నారు. ఈమధ్యకాలంలో ఇవి చాలా ఎక్కువయయ్యాయి. ఇప్పుడు మరో విషాద వార్త చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కె.జయదేవ్ సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఎన్‌ఎఫ్‌డిసి నిర్మించిన ‘కోరంగి నుంచి’ చిత్రానికి జయదేవ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆయనకు చాలా మంచి పేరు తెచ్చింది. 2022లో రూపొందిన ఈ సినిమాను పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ప్రముఖ జర్నలిస్ట్, దర్శకుడు కె.ఎన్.టి.శాస్త్రి అందరికీ సుపరిచితులే. ఉత్తమ సినీ విమర్శకుడిగా జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకున్నారాయన. కె.ఎన్.టి.శాస్త్రి కుమారుడే కె.జయదేవ్. ‘కోరంగి నుంచి’ చిత్రం ద్వారా 12 అంతర్జాతీయ, 7 జాతీయ అవార్డులను గెలుచుకున్నారు జయదేవ్. ఆయనకు భార్య యశోధ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. జయదేవ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.