మన కమెడియన్ల పారితోషికాలు ఎంతో తెలుసా?
on Mar 6, 2017
నాలుగు కామెడీ సీన్లు వర్కవుట్ అయితే చాలు.. సినిమా హిట్టే అనే నమ్మకంలో ఉంది చిత్రసీమ. అందుకే కథకు సంబంధం లేని కామెడీ ట్రాకులు పుట్టుకొస్తున్నాయి, కమెడియన్లు రాజ్యం ఏలుతున్నారు. సినిమాలో అక్కడక్కడ కనిపించే హాస్యనటులు స్టార్లుగా మారిపోతున్నారు. రెండు సినిమాల్లో కామెడీ హిట్టయితే చాలు, ఆ నటుడికి రాజయోగమే. అడిగినంత పారితోషికం ఇచ్చి, అందలం ఎక్కిస్తుంటారు దర్శక నిర్మాతలు. అందుకే కమెడియన్లు రెండు చేతులా.. సంపాదించేస్తుంటారు. కొంతమంది కమెడియన్ల పారితోషికం వింటే.. షాక్ తినక మానదు. అసలు మన కమెడియన్లు ఎంత తీసుకొంటున్నారు?? ఎవరి డిమాండ్ ఎంత?? అనే విషయాల్ని ఆరా తీస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ ఇప్పటికీ బ్రహ్మానందమే. ఇప్పుడు ఆయనకు అవకాశాలు కాస్త తగ్గాయన్న మాట వాస్తవం. అయితే.. బ్రహ్మానందం కావాలంటే ఇప్పటికీ అడిగినంత మొత్తం చదివించుకోవాల్సిందే. టాలీవుడ్‌లో ఓ కమిడియన్‌కు క్యార్ వాన్ ఉందంటే.. అది బ్రహ్మానందానికే. బ్రహ్మీ మంచి డిమాండ్‌లో ఉన్నప్పుడు ఒక్క రోజుకి రూ.4 లక్షలు తక్కువ కాకుండా వసూలు చేసేవాడు. ఆ తరవాత బ్రహ్మీ పారితోషికం గంటకింత అన్న చందాన మారిపోయిందని చెప్పుకొన్నారు. బ్రహ్మీ పారితోషికం ఇప్పటికీ మూడు లక్షలకు తగ్గదు.
అలీ రోజుకి రెండున్నర లక్షలకు తగ్గకుండా వసూలు చేస్తున్నాడిప్పుడు. అలీ తరవాత అంత డిమాండ్ ఉన్నది 30 ఇయర్స్ ఫృథ్వీకే. ఆయన పారితోషికం ఇప్పుడు రోజుకి రూ.2 లక్షల వరకూ ఉంది. సప్తగరి, రఘుబాబు, వెన్నెల కిషోర్... వీళ్లంతా రోజుకి లక్ష రూపాయలు అందుకొంటున్నారు. తాగుబోతు రమేష్ పారితోషికం కూడా ఇంచుమించుగా ఇంతే. జబర్ దస్త్ పుణ్యమా అని, అందులో కనిపిస్తున్న కమిడియన్లకు వెండి తెరపై డిమాండ్ బాగా పెరిగింది. వీళ్లందరికీ రోజుకి 50 వేలు తక్కువ కాకుండా అందుతోందని టాక్. కృష్ణ భగవాన్ ఒకప్పుడు రెండు లక్షల వరకూ వసూలు చేసేవాడట. ఇప్పుడు తన డిమాండ్ బాగా పడిపోయింది. సినిమా మొత్తానికి రెండు లక్షలు ఇస్తే గొప్పే అంటున్నారు. ఆయనకి మరో హిట్టు పడితే చాలు.. గత వైభవం వచ్చేయడం ఖాయం. ఇలా.. టాలీవుడ్‌లో కమిడియన్లు చక్రం తిప్పుతున్నారు. ఇప్పుడున్న పారితోషికాలకు యేడాది పాటు.. నిర్విరామంగా సినిమాలు చేస్తే చాలు. లైఫ్‌లో సెటిలైపోవొచ్చు.