వేణుమాధవ్‌కు టాలీవుడ్ ప్రముఖుల నివాళి
on Sep 25, 2019
అనారోగ్యంగా అర్ధంతరంగా కన్నుమూసిన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌కు టాలీవుడ్ అంతా నివాళులర్పిస్తోంది. నిన్న మొన్నటి వరకు తమతో కలిసి నటించి, తమతో ఒక కుటుంబ సభ్యుడిలా మెలిగిన ఆయన చనిపోయాడనే వార్త కలచివేస్తుండగా, టాలీవుడ్ ప్రముఖులంతా తమతో ఆయన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సంతాపం ప్రకటిస్తున్నారు.
పాత్రకు వన్నె తెచ్చేవాడు: చిరంజీవి
వేణుమాధవ్ తొలిసారి నాతో కలిసి 'మాస్టర్' సినిమాలో నటించాడు. అటుపై పలు సినిమాల్లో నటించి హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు. కొన్ని పాత్రలు తనకోసమే పుట్టాయన్నంతగా నటించేవాడు. ఆ పాత్రకే వన్నే తీసుకొచ్చే వాడు. వయసులో చిన్నవాడు. సినీ పరిశ్రమలో తనకింకా బోలెడంత భవిష్యత్ ఉందని అనుకునే వాడిని. కానీ దేవుడు చిన్న చూపు చూశాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.
మంచి టైమింగ్ ఉన్న నటుడు: పవన్ కల్యాణ్
అందర్నీ నవ్వించిన వేణుమాధవ్ ఇక లేరు అనే విషయం దిగ్భ్రాంతికి లోను చేసింది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ కోలుకుంటారనుకున్నాను. నటుడిగా ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన మరణించడం బాధాకరం. 'గోకులంలో సీత' నుంచి నాతో పలు చిత్రాల్లో నటించారు. హాస్యం పండించడంలో మంచి టైమింగ్ ఉన్న నటుడు. మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉండటంతో సెట్లో అందరినీ సరదాగా ఉంచేవారు. వర్తమాన రాజకీయ విషయాలపై ఆసక్తి చూపేవారు. వేణుమాధవ్ మృతికి నా తరపున, జనసైనికుల తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
ఇండస్ట్రీకి తీరని లోటు: డాక్టర్ రాజశేఖర్
వేణుమాధవ్ ఆయన మా కుటుంబానికి ఎంతో సన్నిహిత మిత్రుడు. నన్ను బావా అని, జీవితను అక్క అని వేణుమాధవ్ పిలిచేవారు. ప్రతి పండక్కి తప్పకుండా ఫోన్ చేసేవాడు. అంతకు ముందే మెసేజ్ చేసి విష్ చేసేవాడు. మేమంటే తనకు అంత అభిమానం, ప్రేమ. మేమిద్దరం కలిసి సుమారు పది చిత్రాల్లో నటించాం. 'మనసున్న మారాజు', 'రాజ సింహం', 'ఒక్కడు చాలు', 'గోరింటాకు' చిత్రాల్లో తన నటనకు, హాస్యానికి మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్కరినీ వరుసలు పెట్టి పిలుస్తూ కుటుంబంలా కలుపుకుని వెళ్లేవారు. అంత మంచి మనిషి ఇంత త్వరగా లోకాన్ని విడిచి వెళతాడని అనుకోలేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ('మా') ఎన్నికల సమయంలో వేణుమాధవ్‌కి ఆరోగ్యం బాలేదట! కానీ, ఎవరికీ తెలియన్విలేదు. సాటి కళాకారుల కోసం ముందడుగు వేశారు. ఎన్నికల్లో విజయం సాధించారు. తర్వాత వ్యక్తిగతంగా కొన్ని కార్యక్రమాలకు హాజరు కాకపోయినా.. 'మా'కు సంబంధించి ఏం వచ్చినా వెంటనే స్పందించేవారు. తన అభిప్రాయం చెప్తారు. గత వారం ఆయన హాస్పటల్‌లో ఉంటే వెళ్లి కలిశాను. సోమవారం సాయంత్రం డిశార్జ్ అయ్యారు. మళ్లీ సీరియస్ అయిందని మంగళవారం అడ్మిట్ చేశారు. అందరినీ ఎన్నో ఏళ్లుగా నవ్వించి నవ్వించి ఈ రోజు లోకాన్ని విడిచి వెళ్లి ఏడిపిస్తున్నారు. వేణుమాధవ్ మృతి ఇండస్ట్రీకి తీరని లోటు.
హాస్యనటుడిగా శిఖరాగ్ర స్థాయికి చేరుకున్నారు: డైరెక్టర్ ఎన్. శంకర్
వేణుమాధవ్ భౌతికంగా లేరనే వార్త నన్ను ఎంతగానో బాధపెట్టింది. తెలుగు సినిమా వినోదాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి హాస్యనటుడిగా శిఖరాగ్రస్థాయికి చేరుకున్నారు. ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. వేణుమాధవ్ నా సినిమాలన్నింటిలో నటించాడు. మా ఇద్దరిది ఒకే జిల్లా. ఎంతో ఆత్మీయంగా ఉండేవాడు. అద్భుతమైన హాస్యనటుడిగా వెలుగొందిన వేణుమాధవ్ మరణం సినీ పరిశ్రమకు, మిత్రులకు, నాలాంటి సన్నిహితులకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ నుభూతిని తెలియజేస్తున్నాను.
నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు: హీరో శ్రీకాంత్
మేమిద్దరం చాలా సినిమాలు కలిసి యాక్ట్ చేశాము. నటుడిగా, కమెడియన్‌గా సినీ రంగ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు వేణుమాధవ్. ఈరోజు ఆయన ఆకాల మరణం ఎంతో బాధాకరం. ఆయన మన మధ్య లేకపోవడం తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానునభూతిని వ్యక్తం చేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.
Also Read