"అది మనది. మన ఆత్మగౌరవం" అని పిలుపునిచ్చిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. 'సైరా ట్రైలర్ 2' రివ్యూ
on Sep 26, 2019
"ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికీ లక్ష్యం ఒక్కటే.. స్వాతంత్ర్యం.. స్వాతంత్ర్యం.. స్వాతంత్ర్యం.." అని ఉరికొయ్యకు వేలాడే ముందు గర్జించాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అలా అని మనం 'సైరా.. నరసింహారెడ్డి' సినిమాలో చూడబోతున్నాం. నరసింహారెడ్డి పాత్రలో ఆ పిలుపు ఇచ్చేప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రదర్శించిన హావభావాలు ప్రేక్షకుల్ని భావోద్రేకానికి పురికొల్పడం ఖాయం.
'సైరా.. నరసింహారెడ్డి' విడుదల సమయం దగ్గర పడుతోంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలవుతోంది. ఇప్పటికే మేకింగ్ వీడియో, టీజర్, ట్రైలర్, ప్రి రిలీజ్ ఈవెంట్ వంటి ప్రమోషన్స్‌తో మేకర్స్ 'సైరా'కు కావాల్సినంత హైప్ తీసుకు వచ్చేశారు. ఇప్పుడు ఆ వేడిని మరింత పెంచడానికి 'సైరా ట్రైలర్ 2'ను రిలీజ్ చేశారు. నిజానికి ట్రైలర్ అంటే కనీసం ఒకటిన్నర నిమిషాల నుంచి 3 నిమిషాల నిడివి మధ్యలో ఉండటం పరిపాటి. అందుకు భిన్నంగా ఈ సెకండ్ ట్రైలర్ నిమిషంలోపే ఉండటం గమనార్హం. సిద్ధమ్మ, లక్ష్మి పాత్రలు ఈ ట్రైలర్‌లో అసలు కనిపించలేదు. అవుకు రాజు, వీరారెడ్డి పాత్రలు సెకనులో వందో వంతులో మనం గుర్తించేలోపే మాయమవుతాయి.
ఈ ట్రైలర్ మొత్తం మీద నాలుగంటే నాలుగు డైలాగ్స్ వినిపించాయి. వాటిలో రెండు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నోటివెంట వచ్చేవి కాగా, మరొకటి గోసాయి వెంకన్న చెప్పేది. ట్రైలర్ మొదట్లో బ్రిటిష్ ఆఫీసర్ నోటి నుంచి వచ్చే డైలాగ్ ఇంకొకటి. అంతే!.. అయితే ఫస్ట్ ట్రైలర్, సెకండ్ ట్రైలర్‌లను గమనిస్తే కొట్టొచ్చినట్లు కనిపించే అంశం.. 'సైరా' ఎంతటి విజువల్ వండర్‌గా ఉండనున్నదో, అంతకు మించి శక్తిమంతమైన సంభాషణలతో భావోద్వేగాల్ని ప్రేరేపించేదిగా ఉంటుందని.
సాయిమాధవ్ బుర్రా కలం నుంచి జాలువారిన ఈ సంభాషణలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయని ట్రైలర్లలో మనం విన్న కొన్ని డైలాగ్స్‌తోటే అర్థమైపోతోంది. బ్రిటిష్ ఆఫీసర్ "ఇండియాని ఈజీగా దోచుకోవచ్చు. టాక్సుల్ని 300 పర్సెంట్ పెంచండి. బలగాలతో వెళ్లిన మన ఓడలన్నీ వాళ్ల బంగారంతో తిరిగి రావాలి" అంటూ ఉండగా ఈ ట్రైలర్ మొదలవుతుంది. సముద్రంలో బ్రిటిష్‌వాళ్ల ఓడల్ని చూస్తుంటే వీఎఫ్ఎక్స్ ఆధారంగా ఆ సన్నివేశాల్ని తీశారని ఇట్టే ఊహించేయవచ్చు. ఈ సందర్భంగా తెల్లవాళ్లు.. సామాన్య పౌరుల్ని ఒంటిపై గోచి తప్ప బట్టలు లేకుండా చేసి, తాళ్లతో కట్టేసి, కొరడాలతో చిత్రహింసలు పెడుతున్న దృశ్యం, రైతుల్ని సామాహికంగా తుపాకులతో నిర్దాక్షిణ్యంగా కాల్చివేసే దృశ్యాలు, వాళ్ల ధాన్యాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకొనే, నరసింహారెడ్డి కోటను ఫిరంగులతో ధ్వంసం చేయడానికి ప్రయత్నించే దృశ్యాలు మనం చూడొచ్చు.
"అది మనది. మన ఆత్మ గౌరవం. గడ్డిపరక కూడా గడ్డ దాటకూడదు." అంటూ ఉద్రేకంగా ఒక వాగు దగ్గర తడిసిన బట్టలతో నరసింహారెడ్డి తనవాళ్లతో అన్నాడు. ఒక బ్రిటిష్ అధికారితో తలపడ్డాడు. అడ్డు వచ్చిన సైనికుల్ని తన కత్తికి బలి ఇచ్చాడు. ఒక సైనికుడి తలని ఖండించాడు. బ్రిటిష్ సైన్యాన్ని తన దళంతో ఢీకొట్టాడు. రెండు పక్షాల మధ్యా భీకర సంగ్రామం. బ్రిటిష్ వాళ్లు అప్పటి అధునాతన ఆయుధాలైన ఫిరంగులతో, తుపాకులతో తలపడ్డారు. నరసింహారెడ్డి మనుషులు కత్తులు, గండ్రగొడ్డళ్లు వంటి సంప్రదాయ ఆయుధాలతోటే విరుచుకుపడ్డారు. ఆయన దళంలో చేరిన రాజా పాండి కూడా తన 'మడువు'లతో కసకసా ప్రత్యర్థుల్ని పొడిచేస్తూ కనిపించాడు.
నరసింహారెడ్డికి గురువు గోసాయి వెంకన్న "చంపడమో, చావడమో ముఖ్యం కాదు. గెలవడం ముఖ్యం." అని ఉపదేశించాడు. ఆ మాటల స్ఫూర్తితో బ్రిటిషర్లపై గెలుపు సాధించడమే లక్ష్యంగా చేసుకున్నాడు నరసింహారెడ్డి. ఆ తర్వాత కట్లు తెంచుకున్న ఎద్దులమంద దాడి చేస్తుంటే పౌరులు హాహాకారాలు చేస్తూ చెల్లాచెదురవుతున్న సన్నివేశం, గుడి దగ్గర జాతర సనివేశం కనిపించాయి. "ఇండియా యునైట్స్ ఫర్ ద బిగ్గెస్ట్ బ్యాటిల్ ఎవర్" అనే క్యాప్షన్‌తో 'సైరా.. నరసింహారెడ్డి' టైటిల్ రావడాన్ని చూస్తాం.
ట్రైలర్‌లోని చివరి సన్నివేశం.. సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశమే. ఉరికంబంపై నిల్చొన్న నరసింహారెడ్డి కంఠనాళ్లాలు తెగిపోయేలా "ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికీ లక్ష్యం ఒక్కటే.. స్వాతంత్ర్యం.. స్వాతంత్ర్యం.. స్వాతంత్ర్యం.." అని పిలుపునిచ్చాడు. చారిత్రకంగా చూస్తే నరసింహారెడ్డిని కోయిలకుంట్లలోని జుర్రేరు వాగు వద్ద రెండు వేల మంది జనం చూస్తుండగా, బహిరంగా ఉరి తీశారు. కానీ ఈ ట్రైలర్‌లో చూపిన షాట్ ప్రకారం ఉరికంబానికి నాలుగు వేపులా కనిపించిన జన సందోహాన్ని చూస్తే.. వాళ్ల సంఖ్య లక్షల్లో ఉంటుందేమో అనిపిస్తుంది. భారీతనం కోసమే అంతమంది మనుషుల మధ్య నరసింహారెడ్డిని ఉరి తీసినట్లు డైరెక్టర్ సురేందర్ రెడ్డి చిత్రీకరించినట్లు అనిపిస్తుంది.
సినిమా అంతా ఇలా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని దర్శకుడు మూవీని రూపొందించాడనేది స్పష్టమవుతుంది. చరిత్రను ఎక్కడా వక్రీకరించకుండా డైరెక్టర్ 'సైరా'ను తీశాడని ప్రి రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి కితాబు ఇచ్చారు. ఆయన మాటల్లో నిజమెంత ఉందన్నది సినిమా రిలీజయ్యాక చరిత్ర పరిశోధకులు నిర్ధారిస్తారు. కానీ ప్రేక్షకులకు కావాల్సింది.. తమను అలరించే, తమలో భావోద్వేగాల్ని రేపెట్టే సినిమా. ఆ విషయంలో 'సైరా' గ్రాండ్ సక్సెస్ అవుతుందని విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు.