ఫిల్మ్ కోర్సు కోసం శేఖర్ కమ్ముల ఇచ్చిన 'స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్' ఇదే!
on Oct 19, 2021
చిన్నప్పట్నుంచీ శేఖర్ కమ్ముల హీరో ఎవరంటే వాళ్ల నాన్నే. ఆయన్ని చూస్తూ, ఆయన పాటించే విలువల్ని గమనిస్తూ పెరిగాడు శేఖర్. అమ్మన్నా, అక్కలన్నా ఆయనకు అంతే ఇష్టం. ఒక్కోసారి భయమేస్తుంటుంది, తనక్కడ ఆగిపోయాడేమోనని. అమెరికా వెళ్లినా ఆ అనుబంధాల్ని వదల్లేదు. ఇంజనీరింగ్ నుంచి సినిమాల్లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నాడనేది హార్వర్డ్ యూనివర్సిటీలో ఫిల్మ్ కోర్స్ చదువుకోడానికి వెళ్లినప్పుడు ఇచ్చిన 'స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్' ఉంది.
"అందరికీ డబ్బులు, అమెరికా సిటిజన్‌షిప్, గ్రీన్ కార్డ్ వంటివాటిపై దృష్టి ఉంటుంది. కానీ నేను చూసే, నేను కలలు కనే ప్రపంచం వేరు. ఆ ప్రపంచం చూపించాలంటే విజువల్ మీడియాకు రావాలని అప్లై చేస్తున్నా" అని అందులో రాశాడు. అలా రాయడానికి వెనకున్నది తన ఇంటి వాతావరణం, తనవాళ్లతో ఉన్న అనుబంధం.
ఆ ఫిల్మ్ స్కూల్ నుంచి శేఖర్ వెనక్కి తిరిగి చూడలేదు. అతనిలో స్పెషల్ టాలెంట్ ఉందని ప్రొఫెసర్లు గుర్తించారు. హాలీవుడ్లో శేఖర్‌కు ఇంటర్న్‌షిప్ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా అక్కడి కథల్ని చెప్పలేనని, హైదరాబాద్ వచ్చేశాడు. ఫిల్మ్ స్కూల్ నుంచి బయటకు వచ్చాక 'డాలర్ డ్రీమ్స్' నుంచి తాననుకున్నదే తీస్తూ వచ్చాడు. తన సినిమాలకు హాంటింగ్ ఫీల్ ఉంటుందని అర్థం చేసుకున్నాడు.
"నా సినిమాలు ఒక హ్యాపీనెస్‌ను ఇస్తాయి. ఎంటర్టైన్మెంట్ వేరు, హ్యాపీనెస్ వేరు. వినోదాన్ని ఆ క్షణంలో మాత్రమే పొందుతాం. కానీ ఆనందం అనేది కొంతకాలం పాటు మనల్ని అంటిపెట్టుకొని ఉంటుంది. అలాంటి ప్రపంచాన్ని క్రియేట్ చేశాననుకుంటాను. పెళ్లయి పిల్లలు పుట్టాక మనుషులతో నా అనుబంధం మరింత విస్తృతమైంది" అంటాడు శేఖర్. నిజమే కదా!!
Also Read