పాన్ ఇండియా హీరోలు బీ రెడీ.. ఇన్నాళ్లకు సరైన విలన్ వచ్చాడు!
on May 20, 2024
పేరున్న హీరోలు స్క్రీన్ మీద విలనిజం పండిస్తే ఆ కిక్కే వేరు. అలా విలనిజం పండించే హీరోలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో హీరో చేరిపోయాడు. అతను ఎవరో కాదు.. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj).
జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్.. ఏవో కారణాల వల్ల కొన్నేళ్లు నటనను బ్రేక్ ఇచ్చాడు. 2017 లో వచ్చిన 'ఒక్కడు మిగిలాడు' తర్వాత అతను హీరోగా నటించిన సినిమా రాలేదు. హీరోగా రీఎంట్రీ ఇస్తూ గతేడాది 'వాట్ ది ఫిష్' అనే సినిమా ప్రకటించాడు.. కానీ కొంతకాలంగా దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా లేవు. ఈ క్రమంలో మనోజ్ విలన్ గా ఎంట్రీ ఇస్తుండటం ఆసక్తికరంగా మారింది.
తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మిరాయ్' (Mirai). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. మనోజ్ పుట్టినరోజు(మే 20) సందర్భంగా తాజాగా అతని పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ విడుదల చేశారు. వరల్డ్ లోనే మోస్ట్ డేంజరస్ ఫోర్స్ 'బ్లాక్ స్వార్డ్'గా మనోజ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది. స్టైలిష్ విలన్ గా మనోజ్ లుక్, స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయాయి. గ్లింప్స్ చూస్తుంటే.. లేట్ గా అయినా మనోజ్ కి సరైన పాత్ర పడిందనే అభిప్రాయం కలుగుతోంది.
'మిరాయ్' సినిమా పాన్ ఇండియా వైడ్ గా 2025, ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ సినిమా తరువాత.. భారీ పాన్ ఇండియా సినిమాల్లో స్టైలిష్ విలన్ గా మనోజ్ కి అవకాశాలు క్యూ కట్టినా ఆశ్చర్యంలేదు.