అదిరిపోయిన 'ది ఘోస్ట్' ట్రైలర్!
on Aug 25, 2022
నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ది ఘోస్ట్'. 'పిఎస్‌వి గరుడ వేగ' తర్వాత ప్రవీణ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకి ఇంకా ఆరు వారాలు ఉండగానే తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.
'ది ఘోస్ట్' ట్రైలర్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైంది. పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది ట్రైలర్. తన సోదరిని, ఆమె కూతురుని చంపాలని చూస్తున్న అండర్ వరల్డ్ ని నాగ్ ఎలా ఎదిరించాడు? చివరికి వాళ్ళని రక్షించగలిగాడా? వంటి ఆసక్తికర అంశాలతో ట్రైలర్ ను రూపొందించారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్స్, నాగ్ స్క్రీన్ ప్రజెన్స్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహన్ నటించింది. ఈ చిత్రంలో పాటలకు భరత్-సౌరభ్ సంగీతం సమకూర్చగా, మార్క్ కె. రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Also Read