ఐదేళ్ల క్రితం 'అర్జున్ రెడ్డి'తో ప్రభంజనం.. ఇప్పుడు 'లైగర్'తో ఘోర పరాభవం!
on Aug 25, 2022
'పెళ్లి చూపులు'(2016)తో సోలో హీరోగా మారి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ.. ఆ మరుసటి ఏడాది 2017లో వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. ఆగస్ట్ 25, 2017న విడుదలైన ఈ మూవీ విజయ్ కి ఓవర్ నైట్ లో క్రేజ్ ని తీసుకొచ్చింది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత ఇప్పుడదే తేదీకి ఈరోజు(ఆగస్ట్ 25) విడుదలైన 'లైగర్' మాత్రం విజయ్ కి ఘోర పరాజయాన్ని మిగిల్చేలా ఉంది.
సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన 'అర్జున్ రెడ్డి' పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 'పెళ్లి చూపులు' టైంలో విజయ్ ప్రేక్షకులకు పెద్దగా తెలీదు. కానీ 'అర్జున్ రెడ్డి' రిలీజ్ టైంలో తన యాటిట్యూడ్, మాటలతో వార్తల్లో నిలిచాడు. ఇక ఆ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ మాటలు కొందరికి పొగరుగా, ఓవర్ కాన్ఫిడెన్స్ లా కూడా అనిపించాయి. కానీ సినిమా విడుదలయ్యాక విజయ్ యాటిట్యూడ్ కి యూత్ అట్రాక్ట్ అయ్యారు. మూవీ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకొని రూ.25 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఘన విజయాన్ని అందుకుంది. 'అర్జున్ రెడ్డి'తో విజయ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ని అంత తేలికగా ఎవరూ మరిచిపోలేరు. అయితే ఆ తర్వాత 'గీత గోవిందం' మినహా ఏ సినిమాతోనూ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు విజయ్. ఇప్పుడు ఎన్నో అంచనాలతో 'అర్జున్ రెడ్డి' రిలీజ్ కి డేట్ కి విడుదలైన 'లైగర్' కూడా దారుణమైన నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.
విజయ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'లైగర్' నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. విజయ్ కూడా నేషనల్ వైడ్ గా తిరిగి ఈ సినిమాని ఓ రేంజ్ లో ప్రమోట్ చేశాడు. పైగా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని 'అర్జున్ రెడ్డి' టైం నాటి ధీమా వ్యక్తం చేశాడు. దీంతో విజయ్ కెరీర్ లో ఇది మరో 'అర్జున్ రెడ్డి' అవుతుందని భావించారంతా. విడుదలైతే గానీ తెలియలేదు ఇది విజయ్ కెరీర్ లోనే ఘోర పరాజయంగా మిగలనుందని. స్టొరీ, స్క్రీన్ ప్లే వీక్ గా ఉండి.. పూరి మార్క్ పూర్తిగా మిస్ అయిన సినిమా ఇది అని ఆడియన్స్ నుండి వినిపిస్తున్న మాట. ఇప్పటికైనా విజయ్ పబ్లిసిటీ మీద ఫోకస్ తగ్గించి, మంచి స్క్రిప్ట్ లు ఎన్నుకోవడం మీద దృష్టి పెట్టాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 'కార్తికేయ-2' వంటి సినిమాల రిజల్ట్ చూసైనా.. పబ్లిసిటీ స్టంట్ లు అవసరం లేకుండానే కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారన్న విషయాన్ని గ్రహిస్తే మంచిదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.