‘సైరా’ డైరెక్టర్‌తో ‘రెడీ’ స్టార్?
on Jun 10, 2020
రాసి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే దర్శకుడు సురేందర్ రెడ్డి. 2005లో విడుదలైన ‘అతనొక్కడే’తో దర్శకుడిగా తొలి అడుగేసిన సురేందర్.. ఆపై ‘అశోక్’(2006), ‘అతిథి’(2007), ‘కిక్’(2009), ‘ఊసరవెల్లి’(2011), ‘రేసుగుర్రం’(2014), ‘కిక్ 2’(2015), ‘ధ్రువ’(2016), ‘సైరా నరసింహారెడ్డి’(2019).. ఇలా పరిమిత సంఖ్యలోనే సినిమాలు చేశాడు. వీటిలో సింహభాగం విజయాలు సాధించాయి. ఇక ఇటీవలే ఒకటిన్నర దశాబ్ద దర్శక ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సూరి.. త్వరలో తన పదో చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నాడని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. ‘ఇస్మార్ట్ శంకర్’తో బౌన్స్ బ్యాక్ అయిన యువ కథానాయకుడు రామ్‌తో సురేందర్ రెడ్డి ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని, ఇప్పటికే స్టోరీ లైన్ కూడా సిద్ధం చేశాడని వినికిడి. అంతేకాదు.. రామ్‌కి స్టోరీ లైన్ వినిపించడం.. దానికి రామ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం కూడా జరిగిందని టాక్. త్వరలోనే రామ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
వాస్తవానికి.. ‘సైరా’ తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సురేందర్ రెడ్డి ఓ సినిమా చేయబోతున్నాడని కొన్నాళ్ళ క్రితం వార్తలు వినిపించాయి. అలాగే మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్‌తోనూ సూరి ఓ చిత్రం చేయబోతున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే వాటికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కట్ చేస్తే.. ఇప్పుడు రామ్‌తో సురేందర్ రెడ్డి సినిమా చేయబోతున్నట్టు వార్తలు రావడం విశేషం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ‘కిక్’ తరువాత రామ్‌తో ఓ సినిమా ప్లాన్ చేశాడు సురేందర్ రెడ్డి. ఆ సినిమానే తరువాత కొన్ని మార్పులు చేర్పులతో ‘ఊసరవెల్లి’గా తెరపైకి వచ్చింది. దీంతో రామ్, సూరి కాంబినేషన్‌కి అప్పట్లో బ్రేక్ పడింది.
మరి ఈ ప్రాజెక్ట్ అయినా వీరి ఖాతాలో ఉంటుందో లేదంటే వార్తలకే పరిమితమవుతుందో చూడాలి.