రానాతో సై అన్న రవితేజ!
on Jun 10, 2020
మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మూవీ తెలుగులో రీమేక్ కానున్నది. దీని రీమేక్ రైట్స్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత సూర్యదేవర నాగవంశీ సొంతం చేసుకున్నారు. ఈ మూవీలో ఇద్దరు స్టార్లు నటించనున్నారు. ఇప్పటికే ఒరిజినల్‌లో పృథ్వీరాజ్ చేసిన కోషి కురియన్ క్యారెక్టర్‌ను చేయడానికి రానా దగ్గుబాటి అంగీకరించాడు. ఇక బిజు మీనన్ చేసిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ అయ్యప్ప నాయర్ రోల్ చేయడానికి తాజాగా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేది పక్కా సమాచారం.
ఇదివరకు ఈ పాత్ర కోసం నందమూరి బాలకృష్ణను నిర్మాతలు సంప్రదించారు. అయితే ఆయన ఆ ఆఫర్‌ను తిరస్కరించారని ఫిల్మ్‌నగర్‌లో వినిపించింది. ఇప్పుడు రవితేజ పచ్చ జెండా ఊపడంతో నిర్మాతలు హాయిగా ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ, రానా కాంబినేషన్ తెరపై బాగా వర్కవుట్ అవుతుందని వారు ఆశిస్తున్నారు. కథ ప్రకారం ఇద్దరూ బద్ధ శత్రువులుగా కనిపించనున్నారు. ఆ ఇద్దరి మధ్య ఘర్షణే ఈ సినిమాకి ఆయువుపట్టు. ఆగస్ట్‌లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయం ఇంతవరకు వెల్లడి కాలేదు.