బన్నీని తక్కువ అంచనా వేశా.. థాంక్యూ మీట్ లో సుకుమార్ కంటతడి!
on Dec 28, 2021

'పుష్ప ది రైజ్' సినిమా డిసెంబర్ 17 న విడుదలై భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీకి అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ తాజాగా హైదరాబాద్ లో థాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ కంటతడి పెట్టుకున్నారు.
వేదిక పైకి రాగానే మాటల్లో చెప్పలేకపోతున్నాను, ఇదొక ఎమోషనల్ జర్నీ, కన్నీళ్లు వస్తున్నాయి అంటూ సుకుమార్ ఎమోషనల్ అయ్యారు. ముందుగా ఆయన తనకు సపోర్ట్ చేస్తున్న తన సతీమణికి థాంక్స్ చెప్పారు. తర్వాత ప్రొడ్యూసర్స్ కి థాంక్స్ తెలిపారు. నిర్మాతలు నవీన్ గారు, రవి గారు వాళ్ళ తెలివితేటల వాళ్ళ ఈ స్థాయికి రాలేదు, వారి వ్యక్తిత్వం వల్ల వచ్చారని ప్రశంసించారు.
దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడని సుకుమార్ కొనియాడారు. దేవి, చంద్రబోస్ గారు కలిసి సినిమాకి అద్భుతమైన సాంగ్స్ ని అందించారని అన్నారు. దేవి ఎలాంటి పరిస్థితుల్లో సాంగ్స్ కంపోజ్ చేసాడో మాకు మాత్రమే తెలుసని, అదేంటో బయటకు చెప్పలేనని అన్నారు. దీంతో దేవి పుష్ప సమయంలో ఏవో సమస్యలు ఎదుర్కొన్నాడని అర్థమవుతోంది.
'ఊ అంటావా' సాంగ్ చంద్రబోస్ నాలుగేళ్ల క్రితం రాసారని, తాను అడిగానని అప్పటి నుంచి ఆ సాంగ్ అలాగే ఉంచారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ సాంగ్ ఇంతటి విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. అదే సమయంలో చంద్రబోస్ ని వేదికపైకి పిలిచిన సుకుమార్ ఆయనకు పాదాభివందనం చేశారు. సీతారామ శాస్త్రి గారి తర్వాత అంతటి గొప్ప వ్యక్తిగా నాకు బోస్ గారు కనిపించారని అన్నారు. బోస్ గారి ప్రతిభ ఏంటో నాకు తెలుసు కాబట్టే ఆయనకు పాదాభివందనం చేసానని తెలిపారు.
పుష్పని తాను తెలుగు సినిమాగానే చూశానని, కానీ బన్నీ, ప్రొడ్యూసర్స్ పట్టుబట్టి దీనిని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారని సుకుమార్ అన్నారు. బీహార్, యూపీ, నేపాల్ ఇలా అన్ని చోట్లకి ప్రింట్స్ పోవాలని వాళ్ళు అంటుంటే.. అంతలేదు అంటూ మనసులో నవ్వుకున్నాను అని సుకుమార్ చెప్పారు. అల్లు అర్జున్ ని తక్కువ అంచనా వేశాను అని సినిమా రిలీజ్ అయ్యాక అర్థమైంది. ఏంటి ఈ కలెక్షన్స్ అంటూ సుకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. పుష్ప కోసం తమ టీమ్ ఎంతో రీసెర్చ్ చేసిందని.. పుష్ప-2 తర్వాత దీనిని వెబ్ సిరీస్ గా తీస్తానని సుకుమార్ అన్నారు. అలాగే, పుష్ప కోసం పనిచేసిన సెట్, ఆర్ట్, లైట్ ఇలా అన్ని డెంపార్ట్మెంట్స్ కి చెందిన వారందరికీ సుకుమార్ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ప్రకటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



