`లైగర్`తో ముచ్చటగా మూడోసారి!
on Dec 28, 2021

యువతరాన్ని విశేషంగా ఆకర్షించిన ఈతరం కథానాయకుల్లో విజయ్ దేవరకొండ ఒకరు. `పెళ్ళి చూపులు`, `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం`, `టాక్సీవాలా` వంటి విజయవంతమైన చిత్రాలతో యూత్ ఐకాన్ గా నిలిచిన మిస్టర్ దేవరకొండ.. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో `లైగర్` చేస్తున్నాడు. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో కిక్ బాక్సర్ గా దర్శనమివ్వనున్నాడు విజయ్ దేవరకొండ. లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2022 ఆగస్టు 25న తెరపైకి రాబోతోంది.
ఇదిలా ఉంటే.. గతంలో ఆగస్టు నెలలో విడుదలైన విజయ్ దేవరకొండ చిత్రాలు బాక్సాఫీస్ సెన్సేషన్స్ గా నిలిచాయి. ఆ సినిమాలే.. `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం`. 2017 ఆగస్టు 25న రిలీజైన `అర్జున్ రెడ్డి` తెలుగునాట ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిస్తే, 2018 ఆగస్టు 15న విడుదలైన `గీత గోవిందం` విజయ్ దేవరకొండ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా రికార్డులకెక్కింది. మరి.. `లైగర్`తో ముచ్చటగా మూడోసారి ఆగస్టు నెలలో పలకరించనున్న విజయ్ దేవరకొండ.. ఈ సారి ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



