సుశాంత్‌ను బ్లాక్‌మెయిల్ చేసిన బన్నీ!
on Mar 16, 2020
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'అల.. వైకుంఠపురములో' మూవీ 2020లో ఇప్పటివరకూ హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా రికార్డయింది. ఈ క్రమంలో అది మహేశ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు'పై డామినేషన్ ప్రదర్శించింది. పుట్టినప్పుడే స్థానాలు మారిన ఇద్దరు మగపిల్లలు పెరిగి పెద్దయ్యాక ఏం చేశారు, వైకుంఠపురం అనే ఇంట్లోకి ప్రవేశించిన బంటూ ఆ ఇంటి సమస్యను ఎలా పరిష్కరించాడనే కథను ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా త్రివిక్రమ్ మలచిన విధానం ప్రేక్షకులను అలరించి, ఆ సినిమాకు బ్లాక్‌బస్టర్ హోదాను అందించింది. బంటూగా అల్లు అర్జున్, రాజ్‌గా సుశాంత్ ఈ సినిమాలో నటించారు. కథానుసారం కుటిల మనస్కుడైన వాల్మీకి (మురళీ శర్మ), తన యజమాని మీద అసూయతో తమ ఇద్దరి పిల్లల్ని వాళ్లు పుట్టినప్పుడే మార్చేయడం మనకు తెలుసు. దాని ప్రకారం వ్యాపారవేత్త అయిన రామచంద్ర (జయరామ్) కొడుకు బంటూ పేరుతో వాల్మీకి దగ్గర నానా అగచాట్లూ పడుతూ పెరిగితే, వాల్మీకి కొడుకు రామచంద్ర ఇంట్లో రాజ్ పేరుతో రాజభోగాలు అనుభవిస్తూ పెరుగుతాడు. చివరకు బంటూ ఎవరో రామచంద్రకు తెలియడం, కథ సుఖాంతమవడం చూశాం.
కాగా ఈ సినిమాకు సంబంధించి సినిమాలో జోడించని ఒక డిలీటెడ్ సీన్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఆ సీన్‌లో రాజ్‌ను బంటూ బ్లాక్‌మెయిల్ చేయడం కనిపిస్తోంది. రాజ్ స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతూ అక్కడే కూర్చొని చూస్తోన్న బంటూ దగ్గరకు వస్తాడు. రాజ్ చేతికి జ్యూస్ గ్లాస్‌ను అందించాడు బంటూ. "సార్.. వట్టి జ్యూసేనా.. మందు.. ఏదైనా?" అని బంటూ అడిగితే, "ఉహూ" అని అడ్డంగా తలాడించాడు రాజ్. "పోనీ అమ్మాయిలూ.." అని బంటూ అంటే, "ఛీ ఛీ" అన్నాడు రాజ్. బంటూ "డ్రగ్సూ.." అంటే, రాజ్ "హేయ్.." అని వారించాడు. "మరి నువ్వు?" అని బంటూని అడిగాడు. "రీసెంట్‌గా షార్ట్ ఫిలిమ్స్ తీయడం మొదలుపెట్టాను సార్. చాలా ప్రశాంతంగా ఉంది" అని చెప్పాడు బంటూ. "రియల్లీ" అని ఆశ్చర్యపోయాడు రాజ్.
"నిన్నయితే ఒకటి తీశాను. చూస్తారా?" అని సెల్‌ఫోన్ రాజ్ చేతికిస్తూ.. "మొత్తం నైట్ ఎఫెక్ట్‌లో తీశాను సార్" అని చెప్పాడు బంటూ. "ఇట్రెస్టింగ్" అంటూ ఆ ఫిల్మ్ చూసి బిత్తరపోయాడు. అందులో రాజ్ మందు తాగుతూ, ఒక్కసారే రెండు సిగరెట్లు నోట్లో పెట్టుకొని తాగుతూ కనిపించాడు. "తాతను చంపాలి, నాన్నను నరకాలి" అనే గొంతు వినిపించింది. అతను రెండు సిగరెట్లు తాగడం చూసి ఇన్‌స్పైర్ అయ్యి, 'అర్జున్‌రెడ్డి పార్ట్ 2' అనే టైటిల్ దానికి పెట్టానని బంటూ అన్నాడు. బంటూ వైపు తెల్లముఖం వేసుకొని చూస్తూ, "ఇప్పుడు నేనే చెయ్యాలి?" అన్నాడు రాజ్ అమాయకంగా. సీన్ కట్ చేస్తే.. వెళ్తున్న బస్ వెనుక లెదర్ బ్యాగ్ పట్టుకొని రాజ్ పరుగెత్తుతుంటే, అతడి వెనుక కారులో వస్తూ, ఒక చేత్తో జ్యూస్ తాగుతూ, ఇంకో చేత్తో సెల్‌ఫోన్‌లో అతడిని వీడియో తీస్తూ, "కమాన్ రాజ్ కమాన్" అంటున్నాడు బంటూ. అది చూసి అదే కారులో కూర్చొని ఉన్న వాల్మీకి "పాపం" అంటూ బాధపడుతున్నాడు. ఎట్టకేలకు పరిగెత్తి బస్సెక్కి జనం మధ్య చెమట్లు కక్కుతూ నిల్చున్నాడు రాజ్.
ఇదీ సీన్. రాజ్‌ను బంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్న సీన్ పెడితే, బంటూ క్యారెక్టరైజేషన్ పడిపోతుందని ఆలోచించారేమో.. సినిమాలో దాన్ని తీసేశారు. ఇది కానీ పెట్టుంటే సినిమాకి నష్టం కలిగి ఉండేది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
